కొవిడ్‌తో అసమానతలు పెరిగాయి

ABN , First Publish Date - 2021-10-29T08:29:18+05:30 IST

కొవిడ్‌తో అసమానతలు పెరిగాయి

కొవిడ్‌తో అసమానతలు పెరిగాయి

  • 12 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు
  • రాఘవాచారి స్మారకోపన్యాసంలో పాలగుమ్మి


విజయవాడ కల్చరల్‌, అక్టోబరు 28: ‘‘కొవిడ్‌ నేపథ్యంలో దేశంలో అసమానతలు పెరిగాయి. భారత్‌ బిలియనీర్ల సంపద 22 శాతం పెరిగినప్పటికీ దేశ జీడీపీ 7 శాతం కిందకు పడిపోవడం దారుణం. కొవిడ్‌ వల్ల 12 కోట్ల మంది భారతీయులు నిరుద్యోగులుగా మారారు’’ అని రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ తెలిపారు. గురువారం రాఘవాచారి స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ‘కొవిడ్‌ నేపథ్యంలో ప్రసార మాధ్యమాలు, అసమానతలు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కోట్లాది మంది నిరుద్యోగులుగా మారి ఆకలి బాధలు పెరిగి, జీవన ప్రమాణాలు తగ్గిపోయినా... దేశంలోని 140 మంది బిలియనీర్లకు మాత్రమే 22 శాతం ఆదాయం పెరగడం, జీడీపీ పడిపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించే పేదవారు అధిక శాతం ఉన్నారని సుప్రీం కోర్టు చెప్పిన మాటలను కొట్టిపారేసిన కేంద్రం... 54 కోట్ల మందికి 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తామని ఎందుకు ప్రకటించిందని ప్రశ్నించారు. రైతుల ఆందోళనను సుప్రీంకోర్టు సమర్థించినా.. ప్రభుత్వాలు మాత్రం రైతుల నిరసనకు అడ్డుతగులుతూ, బుల్డోజర్లతో రోడ్లు బ్లాక్‌ చేసి అవి రైతులే చేసినట్టుగా ఆరోపణలు చేయడంపై బాధాకరమన్నారు.


కొవిడ్‌ మరణాల సంఖ్యను ప్రపంచానికి తక్కువగా చూపి తప్పుడు సంకేతాన్ని ఇస్తోందన్నారు. కార్పొరేట్‌ సంస్థల బాగోగులు, సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవటమే కాని ప్రధానీ నరేంద్ర మోదీ ఒక్కసారైనా ప్రెస్‌మీట్‌ పెట్టకపోవటం విశేషమన్నారు. 

Updated Date - 2021-10-29T08:29:18+05:30 IST