ఉద్యోగాల భర్తీ లెక్కలపై బహిరంగ చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2021-02-27T04:33:19+05:30 IST

ఉద్యోగాల భర్తీ లెక్కలపై బహిరంగ చర్చకు సిద్ధం

ఉద్యోగాల భర్తీ లెక్కలపై బహిరంగ చర్చకు సిద్ధం
మహబూబాబాద్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కోదండరాం

టీజేఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం

మహబూబాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 26 : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లెక్కలపై బహిరంగ చర్చకు సిద్ధమని వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టబద్రుల నియోజకవర్గ తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం ప్రకటించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఆరేళ్ల కాలంలో 67,600 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, ఈవిషయంపై కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలు, హైదరాబాద్‌ గన్‌పార్క్‌, చిక్కడపల్లి లైబ్రరీలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. 

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడారు. స్వరాష్ట్రం సిద్ధించాక 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని, వాటిని సంవత్సరలోగా పూర్తి చేస్తామని ప్రకటించినట్లు వివరించారు. ట్రైజరీలో 010 పద్దు ద్వారా వేతానలు చెల్లించినవే సర్కార్‌ ఉద్యోగాల కిందకు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.64 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారని, వారిని రెగ్యులరైజ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల పే రివిజన్‌ కమిటీ (పీఆర్సీ) 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని నివేదిక ఇచ్చిందని, దీనిపై తెలంగాణ సర్కార్‌ ఏమి చెబుతుందని ప్రశ్నించారు. తప్పుడు లెక్కలు చెబుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు కొత్త నాటకానికి తెరలేపారని, ఈప్రకటనలతో పట్టభద్రులు, నిరుద్యోగులు మోసపోవద్దన్నారు. నిరుద్యోగ భృతి కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. తాము ప్రశ్నించే గొంతుకలమే కాదని.. పోరాడే శక్తులమని, తనకు అవకాశం ఇచ్చి ఆదరిస్తే చట్టసభల్లో ప్రజల పక్షాన నిలబడుతామన్నారు. సమావేశంలో టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్‌, పరామత్మాచారి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న, పైండ్ల యాకయ్య, ఇరుగు మనోజ్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-02-27T04:33:19+05:30 IST