కాకతీయుల వారసత్వ సంపదను పరిరక్షిస్తాం

ABN , First Publish Date - 2021-08-21T06:04:48+05:30 IST

కాకతీయుల వారసత్వ సంపదను పరిరక్షిస్తాం

కాకతీయుల వారసత్వ సంపదను పరిరక్షిస్తాం
హనుమకొండ చౌరస్తా వద్ద రోడ్‌షోలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ప్రాచీన కట్టడాలపై వచ్చే నెలలో సమీక్ష

వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పనులు  15రోజుల్లో ప్రారంభం

మోదీ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు

ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్‌ వేల కోట్లు దండుకున్నారు..

కరోనా కట్టడిలో మోదీ సర్కారు విజయం

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుడిగాలి పర్యటన

విజయవంతమైన ‘జన ఆశీర్వాద యాత్ర’


హనుమకొండ/తొర్రూరు/వర్ధన్నపేట/జనగామ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సుసంపన్నమైన, కాకతీయుల వారసత్వ సంపదను పరిరక్షించేందుకు అన్నిచర్యలు తీసుకుంటానని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. అత్యంత విలువైన కాకతీయు ప్రాచీన కట్టడాలు, శిల్పకళా సంపదను కాపాడడంలో రాష్ట్రప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తాను.. ఈ వారసత్వ సంపదను పదిలపరచడంపై ప్రత్యేక దృష్టిసారిస్తానని చెప్పా రు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మ డి వరంగల్‌ జిల్లాలో సుడిగాలి పర్యటన జరిపారు. 


ఈ సందర్భంగా ఆయన హనుమకొండలో మాట్లాడు తూ.. వచ్చేనెల మరో సారి నగరానికి వస్తానని, అప్పుడు హనుమకొండ వేయిస్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, ఖిలావరంగల్‌ కోట అభివృద్ధిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తానన్నారు. తీసుకోవలసిన చర్యలపై ఒక బ్లూప్రింట్‌ తయారు చేయిస్తానని తెలిపారు.  కల్యాణ మండపం పనులు త్వరగా పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. పది పదిహేను రోజుల్లో మండపం పనులు పునఃప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించి తనకు తెలియచేయాలని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు, శిల్పిని కోరారు. అప్పుడు స్వామివారిని మరోసారి దర్శించుకొని మండప పనులను ప్రారంభిస్తానని చెప్పారు.వేయిస్థంభాల ఆలయానికి, భద్రకాళి ఆలయానికి ఎంతో ఘనచరిత్రతోపాటు అనుబంధం ఉందన్నారు. ఈ రెండు దేవాలయాలు కాకతీయుల కాలంలో నిర్మితమైనవే అన్నారు. హనుమకొండ జిల్లాలోని ప్రాచీన దేవాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  ప్రధాని మోదీ కృషివల్లనే రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు.  కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా.. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈటలను గెలిపించుకొని తీరుతామన్నారు. కేంద్రప్రభుత్వ చొరవ వల్లనే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. 


అంతకుముందు ఆయన  మహబూబాబాద్‌ జిల్లా తొ ర్రూరు పట్టణంలో ప్ర సంగించారు. కరోనాకాలంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం యుద్ధవిమానాల ద్వారా స రఫరా చేసిందన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం గ్రామ  పంచాయతీలకు పెద్దఎత్తున నిధుల ను నేరుగా అందచేస్తున్నదన్నారు. ప్రధాని మోదీ ఏడేళ్లు నీతితో నిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. కానీ.. తెలంగాణలో కేసీఆర్‌ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధు లు ఇస్తుండగా రాష్ట్రప్రభుత్వం మాత్రం తనవంతు నిధు లు సమకూర్చి ఒక్క ఇల్లును కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలోని రైతుకు బ్యాం కుల ద్వారా రూ.6వేల చొప్పున ఇస్తున్న ఘనత కూడా ప్రధానిదేనన్నారు


బడుగులకు పెద్దపీట

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని కిషన్‌రెడ్డి కొనియాడారు. మంత్రివర్గంలోని 74 మందిలో 52 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలవారే ఉన్నారన్నారు.  మంత్రి వర్గంలో చేరిన కొత్త మంత్రులను పార్లమెంటులో పరిచయంచేసే సంప్రదాయం ఉంటుందని, దానిని  సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నందువల్లనే ప్రధాని సూచన మేరకు ఈ యాత్ర చేపట్టామని కిషన్‌రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో మోదీ విజయం సాధించారన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 57కోట్ల మందికి టీకా ఇచ్చారని, డిసెంబర్‌ నెలాఖరుకల్లా అందరికీ ఇవ్వడం పూర్తవుతుందని చెప్పారు.  

కాగా, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌ పాపన్న కోటను కిషన్‌ రెడ్డి శుక్రవారం రాత్రి సందర్శించారు. కోట అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జనగామలోని ప్రధాన చౌరస్తాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ సర్కారుపై నిప్పులు చెరిగారు. 


నిరసన

పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాల ని కోరుతూ దళిత సంఘాల నాయకులు తొర్రూరు పట్టణంలో కిషన్‌రెడ్డి ఆశీర్వాద యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 


సుడిగాలి పర్యటన

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సూర్యాపేట జిల్లా మీదుగా తొలుత మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లికి శుక్రవారం ఉదయం 10.15 గంటలకు చేరుకున్నారు.  అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆయన యాత్ర  తొర్రూరు పట్టణానికి చేరుకుంది. స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో మంత్రికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి విశ్రాంతి భవనం వద్దకు చేరుకున్నారు. ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం  వర్ధన్నపేటకు చేరుకొని రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్‌ జిల్లా పరిధిలోని రంగశాయిపేట నాయుడుపంప్‌ వద్దకు చేరుకోగా,  బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మంత్రి అక్కడి నుంచి ఓపెన్‌ టాప్‌ జీపులో ర్యాలీగా బయలుదేరారు. వరంగల్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ సమీపంలోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చేరుకొని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించారు. కరోనా నియంత్రణకు వ్యాక్సిన్లు ఇస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.  


ఆ తర్వాత హనుమకొండలోని సుప్రసిద్ధ భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పూజలు చేశారు. పట్టు వస్త్రాలను సమర్పించారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండలోని వేయిస్థంభాల గుడికి చేరుకున్నారు. రుద్రేశ్వర స్వామివారికి పూజలు చేశారు. అనంతరం గుడి ఆవరణలోని కల్యాణ మండపాన్ని సందర్శించారు. కొన్నేళ్లుగా అర్ధంతరంగా నిలిచిపోయిన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ కల్యాణ మండపం పనులు పూర్తయ్యే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ప్రతినిధి ప్రొఫెసర్‌ పాండు రంగారావు కాకతీయుల కట్టడాలపై ప్రత్యేకంగా రూపొందించిన ఫోటో ఆల్బమ్‌ కాఫీ టేబుల్‌ బుక్‌ను కేంద్ర మంత్రికి అందచేశారు.  


అక్కడి నుంచి సుబేదారిలోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి కమలాపూర్‌కు చేరుకున్నారు. అనంతరం జనగామ జిల్లాలోకి ప్రవేశించారు. చిన్నపెండ్యాల, ఖిలాషాపూర్‌, జనగామ, పెంబర్తిలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


 కిషన్‌రెడ్డి వెంట యాత్రలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి, నాయకులు బంగారు శ్రుతి, కొండేటి శ్రీధర్‌, వన్నాల శ్రీరాములు, చింతాకుల సునిల్‌, జలగం రంజిత్‌, దేశిని సదానందనం, జి.శివకుమార్‌, రావు అమరేందర్‌ రెడ్డి,  కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.







Updated Date - 2021-08-21T06:04:48+05:30 IST