మలేషియాలో సూర్యాపేట యువకుడి గల్లంతు
ABN , First Publish Date - 2021-10-20T09:03:16+05:30 IST
మలేషియాలో సూర్యాపేట యువకుడి గల్లంతు

సూర్యాపేటక్రైం, అక్టోబరు 19: మలేషియాలో సముద్రంలో పడి సూర్యాపేట జిల్లా యువకుడు గల్లంతయ్యాడు. హ్యాపిలీ నెంబర్ వన్ కన్‌స్ట్రక్షన్స్‌కి చెందిన వాణిజ్యనౌకలో పనిచేస్తున్న రిషివర్దన్ రెడ్డి ఈ నెల 17న ప్రమాదానికి గురయ్యాడు. తన విధుల్లో భాగంగా నౌక లంగర్‌ను తొలగించే క్రమంలో అతను సముద్రంలో పడిపోయినట్లు కంపెనీ ప్రతినిధులు తల్లిదండ్రులకు తెలిపారు. సూర్యాపేటకు చెందిన కారు డ్రైవర్ వెంకటరమణారెడ్డి, కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే మాధవి దంపతుల పెద్దకుమారుడు రిషివర్దన్‌రెడ్డి(21). ఏజెంట్ల చేతిలో మోసపోయి, ఎన్నో కష్టాలు పడి మలేషియా వెళ్లిన రిషివర్దన్ ఇటీవలే హ్యాపిలీ నెంబర్ వన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో చేరాడు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో సముద్రంలో పడిపోయాడు. మలేషియా నౌకాదళానికి చెందిన అధికారులు సముద్రంలో గాలిస్తున్నా ఇంకా రిషివర్దన్ ఆచూకీ లభించలేదు. ప్రమాదం జరిగి రెండు రోజులైనందున రిషివర్దన్‌రెడ్డి మృతి చెందినట్లు భావిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. కుమారుడి మృతిపై తమకు అనుమానం ఉందని అక్కడి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తమ కుమారుడి మృతదేహాన్నైనా దేశానికి తెప్పించాలని జిల్లాకు చెందిన మంత్రి జగదీ్‌షరెడ్డిని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారు కోరారు.