ట్రైబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కేసీఆరే కారణం
ABN , First Publish Date - 2021-11-12T07:50:16+05:30 IST
ఏపీ, తెలంగాణ మధ్య జలాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో జరిగిన జాప్యానికి సీఎం కేసీఆరే కారణమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తేల్చిచెప్పారు.
- సుప్రీంలో కేసు వేసి కేంద్రానిదే బాధ్యత అని ఎలా అంటారు?
- పిటిషన్ ఉపసంహణ హామీ నెరవేర్చడానికి
- కేసీఆర్‌కు ఎనిమిది నెలలు పట్టింది
- కోర్టు పరిధిలో ఉన్నందునే ఏం చేయలేకపోయాం
- కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు కన్నా.. పాత దానికి
- విధివిధానాలు ఖరారు చేయడానికే నా మొగ్గు
- ఏ ట్రైబ్యునల్ అయినా ఉమ్మడి కేటాయింపులను
- 2 రాష్ట్రాలకూ పంచడానికే పరిమితమవుతుంది
- గెజిట్ నోటిఫికేషన్లు డ్రామా అనడం రాజ్యాంగంపై
- దాడి చేయడమే.. అందుకు క్షమాపణ చెప్పాలి
- డీపీఆర్‌ల పేరిట రెండు రాష్ట్రాలూ ఏవో
- నామమాత్రపు కాగితాలు పంపిస్తున్నాయి
- సరైన పద్ధతిలో సమర్పిస్తేనే అనుమతులు ఇస్తాం
- ప్రాజెక్టులను 2 రాష్ట్రాలు బోర్డులకు అప్పగించాలి
- అలా చేయకుంటే రాజ్యాంగ నిబంధనలున్నాయి
- కేసీఆర్‌కు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ కౌంటర్
హైదరాబాద్, న్యూఢిల్లీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ మధ్య జలాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో జరిగిన జాప్యానికి సీఎం కేసీఆరే కారణమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తేల్చిచెప్పారు. 2015లోనే సుప్రీం కోర్టులో కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తుందని ఆయన నిలదీశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ తమ ప్రాజెక్టులను కృష్ణ, గోదావరి బోర్డులకు అప్పగించకపోతే రాజ్యాంగ నిబంధనలున్నాయని హెచ్చరించారు. గురువారం ఆయన ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ కార్యాలయం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రచురణ, ప్రసార మాధ్యమాల పాత్రికేయులతో ప్రత్యక్ష, వర్చువల్ విధానంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో తన పేరును ప్రస్తావిస్తూ జలవివాదాలను లేవనెత్తారని.. అందువల్ల వాస్తవాలు తెలియజేయాలని భావించానని, అందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశాలను ఎందుకు నిర్వహించారో అందరికీ తెలుసని, దాని గురించి తాను మాట్లాడబోనని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్-3 ప్రకారం ట్రైబ్యునల్ వేయాలని 2015లో సుప్రీంకోర్టులో తెలంగాణ కేసు వేసింది. 2020 అక్టోబరు 6వ తేదీన ఆ కేసును రెండురోజుల్లో వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ నాకు చెప్పారు.
8 నెలల తర్వాత కేసును వెనక్కితీసుకున్నారు. ఏడేళ్ల మీ నిర్లక్ష్యానికి కేంద్రం, నేను ఎలా బాధ్యులమవుతాం?’’ అని ప్రశ్నించారు. పిటిషన్ ఉపసంహరణపై ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కేసీఆర్‌కు 8 నెలల సమయం పట్టిందని అన్నారు. చివరికి ఈ ఏడాది అక్టోబరు 6న పిటిషన్ ఉపసంహరణకు కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ట్రైబ్యునల్ ఏర్పాటు నిర్ణయం తీసుకునే పరిధి తమకు లేకుండాపోయిందని గుర్తుచేశారు. పిటిషన్ ఉపసంహరణ తర్వాత ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు. అభిప్రాయం కోసం కేంద్ర న్యాయ శాఖకు ప్రతిపాదనలు పంపించామని, ఈ విషయంలో తాను వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నానని.. కేంద్ర న్యాయ శాఖ మంత్రితో స్వయంగా మాట్లాడి, వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కోరానని వెల్లడించారు. న్యాయ శాఖ నుంచి అభిప్రాయాలు అందిన తర్వాతే.. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా లేక పాత ట్రైబ్యునల్‌కే కొత్తగా విధివిధానాలను ఖరారు చేయాలా అన్నది తేలుతుందని తెలిపారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు పెద్ద ప్రక్రియ కాబట్టి జాప్యాన్ని నివారించడానికి పాత ట్రైబ్యునల్‌కే విధివిధానాలు ఖరారు చేయడానికి తాను మొగ్గుచూపుతున్నాని వెల్లడించారు. రెండింటిలో ఏది జరిగినా.. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచడంపై మాత్రమే ట్రైబ్యునల్ తేల్చుతుందని ప్రకటించారు. న్యాయశాఖ అభిప్రాయం చెప్పేంతవరకూ ట్రైబ్యునల్ ఎప్పట్లోగా ఏర్పాటవుతుందో చెప్పలేమన్నారు.
అలా ఎలా అంటారు?
విభజన చట్టం మేరకు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఏర్పడ్డాయని.. వాటి పరిధులు ఖరారు చేయని కారణంగా కోరల్లేని సంస్థలుగా అప్పుడు మిగిలిపోయాయని షెకావత్ గుర్తుచేశారు. అందుకే రెండు రాష్ట్రాలతో విస్తృతంగా చర్చించి, ఇద్దరు సీఎంల అంగీకారంతో బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. ‘‘ఇప్పుడు అకస్మాత్తుగా కేసీఆర్ దీన్ని పెద్ద డ్రామాగా అభివర్ణిస్తున్నారు. సీఎం ఇలా అనడం ప్రజాస్వామిక వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేయడంగానే భావిస్తున్నాను.’’ అని షెకావత్ మండిపడ్డారు. నోటిఫికేషన్ ప్రకారం.. ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తేవడం, వాటి నిర్వహణకు నిధులివ్వడం, మానవ వనరులు, సదుపాయాలు కల్పించడం, అనుమతిలేని ప్రాజెక్టుల వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించడం వంటివి ప్రధాన అంశాలని వివరించారు. రెండు రాష్ట్రాలూ ఇలా చేస్తేనే బోర్డుల కార్యకలాపాలు సజావుగా సాగుతాయని, తద్వారా దురదృష్టకరమైన పరిస్థితులను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. గెజిట్ నోటిఫికేషన్‌లోని సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని.. కానీ ముందైతే బోర్డుల కార్యకలాపాలు ప్రారంభం కావాలి కదా అని షెకావత్ వ్యాఖ్యానించారు.
గెజిట్ అమలు వాయిదా అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.వాస్తవాలను, వాస్తవ పరిస్థితులను దేశప్రజల ముందు ఉంచాలని, నాణేనికి రెండో కోణం కూడా ప్రజలు తెలియాలనే ఉద్దేశంతోనే తాను ఈ సమావేశాన్ని నిర్వహించానని స్పష్టం చేశారు. డీపీఆర్‌లు సమర్పించినా కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలించడం లేదని రెండు రాష్ట్రాలూ ఆరోపిస్తున్నాయని విలేకరులు ప్రస్తావించగా.. ‘‘నా దగ్గరకు మీరు ఎప్పుడైనా రండి. ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలూ సమర్పిస్తున్న డాక్యుమెంట్లను చూపిస్తాను. ఏవో నామమాత్రపు పేపర్లను పంపిస్తే.. వాటిని డీపీఆర్ అని అనగలమా? మరింత లోతుగా మాట్లాడి వివాదాన్ని సృష్టించాలనుకోవడం లేదు కానీ సరైన ఫార్మాట్లో డీపీఆర్‌లు రావడం లేదు’’అని మంత్రి సమాధానమిచ్చారు. గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చకపోవడంపై స్పందిస్తూ... ప్రాజెక్టు పేరులో అచ్చుతప్పులు ఉన్నాయని, దాన్ని సరిదిద్దడానికి పార్లమెంటు ఆమోదం అవసరమని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పేరుతో అసలు ప్రాజెక్టే లేదని, అయినప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో తాము సరైన పేరును పేర్కొన్నామని వివరించారు. ఇందులో వివాదమేమీ లేదని, ఎందుకు రాజకీయాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై రెండువైపులా వాస్తవాలు చూడాలన్నారు. ఒకవైపే చూస్తే వాస్తవాలు తెలియవన్నారు.