KCR సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో..!

ABN , First Publish Date - 2021-09-03T19:23:14+05:30 IST

విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ప్రాంగణాల్లో ఎలక్ర్టికల్‌ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా తెలంగాణ రాష్ట్ర పునరుద్దనీయ ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (టీఎస్‌ రెడ్కో)తో కలిసి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

KCR సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో..!

హైదరాబాద్‌ సిటీ : విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ప్రాంగణాల్లో ఎలక్ర్టికల్‌ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా తెలంగాణ రాష్ట్ర పునరుద్దనీయ ఇంధనవనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (టీఎస్‌ రెడ్కో)తో కలిసి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో ప్రతి 3 కిలోమీటర్లకు, హై వేలపై 25 కిలోమీటర్లకు ఒకటి చార్జింగ్‌ స్టేషన్‌ అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్‌ జోన్‌ 9 సర్కిళ్ల పరిధిలో 431 వరకు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా శివారు ప్రాంతాలు, ప్రధాన రహదారుల పక్కన సుమారు 200 వరకు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. అలాంటి సబ్‌స్టేషన్లలో ఖాళీ స్థలాలు గుర్తించి అక్కడ చార్జింగ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలను టీఎ్‌సరెడ్కో పరిశీలిస్తోంది. కల్యాణ్‌నగర్‌, గచ్చిబౌలి. జూబ్లీహిల్స్‌, నానక్‌రాం గూడ, సైబర్‌సిటీ, త్రిబుల్‌ ఐటీ, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌, హబ్సిగూడ, సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని పలు సబ్‌స్టేషన్లలో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తిస్తున్నారు. 2023 నాటికి పెద్దసంఖ్యలో ఎలక్ర్టిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా టీఎ్‌సరెడ్కో ముందుకు వెళ్తోంది. 


రెండు రకాలుగా...


ప్రైవేట్‌ కంపెనీలు ఏర్పాటుచేసిన చార్జింగ్‌ స్టేషన్లలో ఒక్కో యూనిట్‌కు రూ. 14-20 వరకు చార్జి వసూలు చేస్తున్నారు. టీఎస్‌ రెడ్కో అధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే స్టేషన్లలో ధరలు ఇంకా నిర్ణయించలేదని, స్టేషన్లలో ప్రస్తుతం ప్రభుత్వ శాఖలో నడుపుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాలను మాత్రమే చార్జ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్లో చార్జింగ్‌ (ఎ/సీ), ఫాస్ట్‌ చార్జింగ్‌ (డీసీ) స్టేషన్లుగా రెండు రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. స్లో చార్జింగ్‌ స్టేషన్‌లో ఒక్కో వాహనానికి 6 నుంచి 8 గంటలు, ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్‌లో గంటన్నర సమయంలో వాహనాలకు ఫుల్‌ చార్జింగ్‌ చేసుకునే అవకాశాలుంటాయని అధికారులు తెలిపారు.  కర్టాటక, ఢిల్లీలో డిస్కంలు చార్జింగ్‌ స్టేషన్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 4.50 పైసలు వసూలు చేస్తుండగా, అక్కడ చార్జింగ్‌ స్టేషన్లలో వాహనాలకు ఒక్కో యూనిట్‌కు రూ. 7.50 వరకు వసూలు చేస్తున్నారు.


Updated Date - 2021-09-03T19:23:14+05:30 IST