రజాకార్లను మరిపిస్తున్న కేసీఆర్
ABN , First Publish Date - 2021-03-21T08:50:57+05:30 IST
సీఎం కేసీఆర్ పాలన రజాకార్ల పాలనను మరిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- అప్పులనే ఆదాయంగా చూపిస్తున్నారు
- దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ పాలన రజాకార్ల పాలనను మరిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్‌కు ఎన్నికలప్పుడు మాత్రమే పోడు భూముల సమస్య గుర్తుకొస్తుందని విమర్శించారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన జాటోత్ తనూ నాయక్ వర్ధంతి సందర్భంగా శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బండి సంజయ్ నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తనూ నాయక్ సాహసాలను ఈ సందర్భంగా సంజయ్ కొనియాడారు. స్వరాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా పోడు భూముల కోసం పోరాడాల్సి రావడం సిగ్గుచేటన్నారు. రజాకార్లతో జరిగిన పోరులో తనూ నాయక్ ప్రాణత్యాగం చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గిరిజనులు భూమి కోసం పోరాటాలు, త్యాగాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పోడు భూముల కోసం పోరాడిన సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాగ్యరెడ్డి సహా బీజేపీ కార్యకర్తలను ప్రభుత్వం నెల రోజులకుపైగా జైలులో నిర్బంధించిందని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం అప్పులనే ఆదాయంగా చూపిస్తోందని, సర్కారు ఇచ్చిన గణాంకాల ప్రకారమే రాష్ట్రం రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది అప్పుల కిస్తీ కోసం రూ.9,139 కోట్లు కడతామని ప్రభుత్వం పేర్కొందని, కనీసం రూ.60 వేల కోట్లైనా కట్టాల్సి ఉంటుందని అన్నారు. అసలు, వడ్డీలు కట్టకపోతే రుణాలు ఇచ్చిన సంస్థలు ఊరుకుంటాయా..? అని ప్రశ్నించారు. దేశంలో ఎంతో కష్టపడి వ్యాక్సిన్ తయారుచేస్తుంటే.. రాష్ట్రంలో 17 శాతం వృథా చేస్తున్నారని, ఇది ఆందోళన కలిగించే పరిణామమని ఆయన అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, వైద్య రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. విద్యకు 6 శాతం, వైద్య రంగానికి 3 శాతం మాత్రమే నిధులు కేటాయించారని అన్నారు. శాసనమండలిలో శనివారం ఆయన మాట్లాడారు.