‘గులాబీ’ పండుగకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-10-25T07:58:57+05:30 IST

గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా జరగనున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.

‘గులాబీ’ పండుగకు  సర్వం సిద్ధం

  • నేడు హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ..
  • రాజధాని వ్యాప్తంగా కేసీఆర్‌ కటౌట్లు
  • ప్లీనరీ పాసుల కోసం నాయకుల అలక..
  • 33 రకాల వంటకాలతో మెనూ
  • 2200 మంది పోలీసులతో బందోబస్తు..
  • ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ సంతోష్‌


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా జరగనున్న టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.  హైదరాబాద్‌ వ్యాప్తంగా గులాబీ తోరణాలు కట్టడంతోపాటు కేసీఆర్‌, కేటీఆర్‌ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ప్రధాన రహదారుల వెంట కటౌట్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్లీనరీ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో పాస్‌లు ఇవ్వడం.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు తలనొప్పిగా మారింది. పాస్‌ల కోసం ముఖ్య కార్యకర్తలు పోటీపడడంతో ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 9 రకాల నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ సహా 33 రకాల వంటకాలతో మెనూ సిద్ధం చేశారు.


ఇందులో తెలంగాణ వంటకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బందోబస్తు ఏర్పాట్లపై హైటెక్స్‌లో సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. 2,200మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ప్లీనరీకి భారీ సంఖ్యలో వాహనాలు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. కాగా, ప్లీనరీ ఏర్పాట్లను ఎంపీ సంతోష్‌ ఆదివారం పరిశీలించారు. ప్లీనరీ సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రులు జగదీశ్‌ రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌ సైతం సభా వేదికను సందర్శించి.. భోజన ఏర్పాట్లు, అతిథుల రిజిస్ట్రేషన్‌, పార్కింగ్‌ ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, టీఆర్‌ఎస్‌ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, ఏడేళ్ల ప్రభుత్వ ప్రస్థానం అద్భుతమని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ ద్విదశాబ్ది వేడుకల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.



Updated Date - 2021-10-25T07:58:57+05:30 IST