నేడు యాదాద్రికి కేసీఆర్
ABN , First Publish Date - 2021-03-04T08:45:06+05:30 IST
దేశంలోనే అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ గురువారం సందర్శించనున్నారు.
ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన..
ఉద్ఘాటనకు సిద్ధమైన ఆలయం
యాదాద్రి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ గురువారం సందర్శించనున్నారు. యాదాద్రి కొండపై ఆలయ ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల అభివృద్ధి పనులు తుది దశకు చేరి ఉద్ఘాటనకు సిద్ధమవుతున్న తరుణంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కొండపై బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రధానాలయం, కొండపై పరిసరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతిని పరిశీలిస్తారు. 3 నెలల్లో ప్రధానాలయ ఉద్ఘాటన చేసి, స్వామి గర్భాలయ దర్శనాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. జీయర్‌స్వామి సూచించిన ఆగమ, వైదిక నియమానుసారం గర్భాలయం, ముఖ మండపం, ఉప ఆలయాలు, క్యూకాంప్లెక్స్లు, ఇతర పనులను సీఎం స్వయంగా పరిశీలిస్తారు. ప్రాకార మండపాలు, మాఢవీధులు, తిరువీధుల్లో నక్షత్ర మొక్కలు, సుగంధ పుష్పాల ఉద్యానవన అభివృద్ధి క్యూకాంప్లెక్స్, ప్రసాదాల కాంప్లెక్స్, శివాలయం, విష్ణు పుష్కరిణిని కేసీఆర్ అణువణువునా పరిశీలించనున్నారు. అలాగే కొండచుట్టూ రింగు రోడ్డు నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణం, గండిచెరువు వద్ద పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణాలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు.
సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ పర్యటన కోసం వైటీడీఏ, ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భువనగిరి జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండపైన ఘాట్ స్వాగత ద్వారం నుంచి పుష్కరిణి, శివాలయం మీదుగా ప్రధానాలయం వరకు రోడ్డును తీర్చిదిద్దారు. ప్రధానాలయం, క్యూలైన్లు, ప్రసాదాల కాంప్లెక్స్, శివాలయం, పుష్కరిణి పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రఽధానాలయం ఎదుట లోహపు క్యూ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేశారు. మాడవీధుల వెంట పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
హరిహరుల నక్షత్ర వృక్షాలు
యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో దేవతా వృక్షాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కృష్ణరాతి శిలల అపురూప శిల్ప సంపదతో అలరించే అష్టభుజి ప్రాకార బాహ్య ప్రాకార, మాఢవీధుల వెంట హరిహరుల నక్షత్ర వృక్షాలు, సుగంధ, పుష్పాల దేవతా ఉద్యానవనం ఆధ్యాత్మికత, ఆహ్లాదాలకు మేళవింపు కానుంది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రధానాలయం బాహ్య ప్రాకార మండపానికి ఉత్తర దిశగా నృసింహుడి జన్మ నక్షత్రం స్వాతి, తుల రాశికి ప్రాధాన్యం గల పొగడ మొక్కలను, ఆ తర్వాత వరుసలో ముక్కంటి పరమశివుడి మిథున రాశి ప్రకారం కదంబ వృక్షపు మొక్కలు నాటారు. ఒక్కో వరుసలో 40 చొప్పున హరిహరుల జన్మనక్షత్ర పొగడ, కదంబ వృక్షాల మొక్కలతో పాటు వాటి మధ్య అర్చనకు వినియోగించే సుగంధ, పుష్పాలు, పచ్చదనం వెలివెరిసేలా ల్యాండ్ స్కేప్ గార్డెన్లను తీర్చిదిద్దుతున్నారు. అష్టభుజి ప్రాకార మండపం వెంట, గోపురాలకు అభిముఖంగా పాండిచ్చేరి కి చెందిన నాణ్యమైన కుండీల్లో దేవతా ప్రాధాన్యం గల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
