పదేళ్లు నేనే

ABN , First Publish Date - 2021-02-08T08:44:25+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని, త్వరలో కేటీఆర్‌ సీఎం పీఠంపై కూర్చుంటారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌

పదేళ్లు నేనే

అయినా సీఎం పదవి నాకు ఎడమ కాలి చెప్పుతో సమానం

మార్పుపై ఎవరైనా మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడతా

బండకేసి కొట్టి పార్టీ నుంచి బయటికి పంపిస్తా

మార్పు చేయాల్సి వస్తే.. అందరికీ చెప్పాకే నిర్ణయం

ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే పదవులు ఊడుతాయ్‌

అనవసరంగా కన్‌ప్యూజ్‌ చేస్తున్నారు.. తెలంగాణ బాగు కోసమే కొనసాగుతున్నా

ముందు ప్రజా సమస్యలు, పార్టీపై దృష్టి పెట్టండి.. కార్యకర్తలతో గ్యాప్‌ పూడ్చుకోవాలి

కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు.. గతంలో పెట్టినోళ్లు ఏమయ్యారో తెలియదా?

ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు పోవద్దు.. బాధ్యత లేకుండా మాట్లాడితే పార్టీకి నష్టం

గ్రేటర్‌ ఎన్నికల బాధ్యత కేటీఆర్‌కు.. సీల్డ్‌ కవర్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పేర్లు 

వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. హైదరాబాద్‌పై త్వరలో నిర్ణయం 

6 లక్షల మందితో టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవ సభ.. త్వరలో మరికొన్ని అద్భుత పథకాలు 

పార్టీని కాపాడుకునే బాధ్యత నాపై.. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌


ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన పేరు ముందు సీఎం పదవి నాకు ఓ లెక్కనా? అది నా ఎడమ కాలి చెప్పుతో సమానం. సీఎం పదవి లేకపోయినా తెలంగాణ తెచ్చినందుకు గాంధీ ఫొటో పక్కన నా ఫొటో పెట్టి పూజలు చేసేవాళ్లు.

ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే మళ్లీ వాళ్లకు పార్టీ టికెట్లు వస్తాయి. నేను చెప్పినట్లు వినకుండా ముందుకు వెళితే పక్కకు తప్పించడం ఖాయం.

పార్టీని కాపాడుకుంటేనే మనం ఉంటాం. ఎంతో కష్టపడి పార్టీని నిర్మించుకున్నాం. కాలక్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఇంతవరకు తీసుకొచ్చిన పార్టీని నిలుపుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది. 

కొత్త పార్టీ పెట్టటం అంత ఈజీనా? ఉత్తగనే అవుతుందా? దానికి ఎంత శ్రమ కావాలి. ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు. ఎన్ని పార్టీలు పోలేదు. నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్‌ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? ఎవరు ఏమయ్యారో తెలియదా? నాలుగు రోజుల్లో తోక ముడుస్తారు. ఎటూకాకుండా తెరమరుగై పోతారు.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని విషయాలు మీతో పంచుకోలేను. నేను రాష్ట్రాన్ని, పార్టీని కాపాడుకోవాలి. అందుకే కొన్నింటిని మీతో ఓపెన్‌గా చెప్పలేకపోతున్నా.


హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని, త్వరలో కేటీఆర్‌ సీఎం పీఠంపై కూర్చుంటారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ద్వంద్వంగా కొట్టిపారేశారు. కేటీఆర్‌ కాబోయే సీఎం అంటూ ఇటీవల టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా దీనిపై మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడతానని హెచ్చరించారు. ‘‘సీఎం మార్పు ఉంటుందని మీకు ఎవరు చెప్పారు? దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?’’ అని ప్రశ్నించారు. మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్‌ నేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు.


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వివిధ అంశాలపై మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘‘నాకేమైంది? మంచిగనే ఉన్నా కదా! ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా.. దుక్కలా ఉన్నానని ఇదివరకే అసెంబ్లీ వేదికగా చెప్పాను కదా! అయినా మీకు క్లారిటీ రాకపోతే ఎట్లా? నేను నచ్చలేదా మీకు? ముఖ్యమంత్రి పదవికి నేను పనికిరానా? నేను మంచిగా పనిచేయడం లేదా? నన్ను సీఎంగా వద్దని అనుకుంటున్నారా చెప్పండి? ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేయాలని కోరుకుంటున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు.. అనవసరంగా ప్రజలను, పార్టీ శ్రేణులను ఎందుకు కన్‌ప్యూజ్‌ చేస్తున్నారు?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, హామీలను నెరవేర్చాల్సి ఉందని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల పార్టీ కార్యకర్తలతో గ్యాప్‌ వచ్చిందని, తక్షణమే దానిని పూడ్చుకోవాలని చెప్పారు. 


పార్టీకి ఓ విధానం ఉంది..

‘‘టీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక విధానం, నిర్మాణం ఉన్నాయి. ఒకవేళ మార్పులు, చేర్పులు చేయాలని అనుకుంటే, నేను కేంద్రానికి వెళ్లాలి, నా అవసరం అక్కడ ఉందని అనుకుంటే, మీ అందరినీ పిలుస్తా.. మాట్లాడుతా. అందరి అభిప్రాయాలతోనే ఏకగ్రీవంగా మార్పు చేస్తా. అనవసర రాద్ధాంతం, అక్కరలేని విషయాలు ఎందుకు? ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే పదవులు ఊడుతాయ్‌’’ అని హెచ్చరించారు. ‘‘అయినా ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన పేరు ముందు సీఎం పదవి ఓ లెక్కనా? అది నా ఎడమ కాలి చెప్పుతో సమానం. సీఎం పదవి లేకపోయినా.. తెలంగాణ తెచ్చినందుకు గాంధీ ఫొటో పక్కన నా ఫొటో పెట్టి పూజలు చేసేవాళ్లు. ఇప్పుడు పదవిలో ఉన్నోడు.. లేనోడు ఏది పడితే అది మాట్లాడుతున్నడు. ఇన్ని అవమానాలు, బాధలు భరించాల్సిన అక్కర నాకేం ఉంది ? తెచ్చిన తెలంగాణ ఆగం కావద్దని, రాష్ట్రాన్ని ఎవరికో అప్పగిస్తే అది ఎటో పోతుందని, అనుకున్నది చేస్తరో చేయరోనని.. బాగు చేద్దామని సీఎం పదవిలో కూర్చున్న. తప్పుడు కామెంట్లు చేసేటోణ్ని ఎవరినీ వదిలిపెట్టేది లేదు’’ అని కేసీఆర్‌ అన్నారు. 


ఎమ్మెల్యేలు ఇష్టానుసారం చేస్తే పీకి పడేస్తా..

‘‘నేను మొదటి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేనే సుప్రీం అని చెబుతున్నా. మంత్రులు, ఇతరులు ఎవరూ అక్కడ వేలు పెట్టొద్దు. కానీ, దీనిని అలుసుగా తీసుకొని కొందరు ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు పోతున్నారు. పద్ధతి మార్చుకోకపోతే అలాంటి వాళ్లను పీకి పారేస్తా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తే, మళ్లీ వాళ్లకు పార్టీ టికెట్లు వస్తాయి. చెప్పినట్టు వినకపోతే పక్కకు తప్పించడం ఖాయం’’ అని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని,  ఇకపై ఎవరైనా లూజ్‌ టాక్‌ చేస్తే బండకేసి కొట్టి.. పార్టీ నుంచి బయటకు పారేస్తానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ‘‘బాధ్యత లేకుండా మాట్లాడిన వాళ్లు ప్రజల్లో చులకన అవుతారు. వారితోపాటు పార్టీకి కూడా నష్టం కలుగుతుందని గుర్తించాలి. ఎవరైనా గీత దాటితే సస్పెన్షన్‌ వేటు వేస్తాం’’ కేసీఆర్‌ స్పష్టం చేశారు. జిల్లాల్లో పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం తప్పనిసరి అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘‘పార్టీని కాపాడుకుంటేనే మనం ఉంటాం. ఎంతో కష్టపడి పార్టీని నిర్మించుకున్నాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఇంతవరకు తీసుకొచ్చిన పార్టీని నిలుపుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుత పథకాలు తీసుకురాబోతున్నామని తెలిపారు. 


కొత్త పార్టీ అంత ఈజీనా?

కేసీఆర్‌ అనూహ్యంగా కొత్త పార్టీ ఏర్పాటు, అందులోని సాధకబాధకాల వంటి అంశాలను ప్రస్తావించారు. ఎవరు పార్టీ పెట్టబోతున్నారనే విషయం చెప్పకుండానే, ‘‘కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీనా ? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు? నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్‌ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? నాలుగు రోజుల్లో తోక ముడుస్తారు. ఎటూకాకుండా తెరమరుగై పోతారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘1985లో టీడీపీ తరఫున నేను సిద్దిపేట నుంచి, రామచంద్రారెడ్డి దొమ్మాట నుంచి ఒకేసారి గెలిచాం. కొన్నాళ్లకు జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి తదితరులతో కలిసి రామచంద్రారెడ్డి టీడీపీ నుంచి బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రె్‌సలో చేరారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి టికెట్‌ కూడా రాలేదు. దాంతో ఆయన తెరమరుగయ్యారు. రామచంద్రారెడ్డి కోసం సిద్ధిపేటలో ఇటీవల నేనే ఇంటి స్థలం ఇప్పించి.. నిర్మాణానికి ఆర్థికసాయం కూడా చేశాను. రాంగ్‌ ట్రాక్‌లో వెళితే ఇలాగే ఉంటుంది. రామచంద్రారెడ్డి మంచివాడైనా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటే’’ అని అన్నారు.



సీల్డ్‌ కవర్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లు..

ఈ నెల 11న జరిగే జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల పేర్లు అదే రోజు వెల్లడిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘‘ఈనెల 11న వాళ్ల పేర్లు నేనే స్వయంగా పేపర్‌ మీద రాసి, సీల్డ్‌ కవర్‌లో పంపిస్తా. ఆ రోజు పార్టీ కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులంతా ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌కు రావాలి. ఇక్కడినుంచే వెళ్లాలి. అక్కడికి వెళ్లాకే సీల్డ్‌ కవర్‌ను ఓపెన్‌ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, నగర మంత్రులు పర్యవేక్షిస్తారు’’ అని చెప్పారు. ఏప్రిల్‌ 27న పార్టీ 20వ వార్షికోత్సవ సభను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఆరు లక్షల మందితో సభ పెడదామని, ఏ జిల్లా నాయకులు ముందుకు వస్తే, ఆ జిల్లాలో సభ ఉంటుందని తెలిపారు. మార్చిలో అసెంబ్లీ, మండలి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధం కావాలని నిర్దేశించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో ఎవరు ఏం మాట్లాడినా తనకు తెలుస్తుందని, ఎవరూ అనవసరపు మాటలు మాట్లాడి, ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని చెప్పారు. ఇక ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణం కోసం మే 4న శంకుస్థాపన చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికలు-2021 పేరిట ఆదివారం నాటి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆరు అంశాలను ఎజెండాలో  చేర్చారు. వీటిపై పార్టీ నేతలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సెల్‌ఫోన్లను అనుమతించలేదు. తెలంగాణ భవన్‌ వద్ద పెద్దఎత్తున మఫ్టీ పోలీసులు మోహరించారు. 


బీజేపీ, ఎంఐఎంపై లేని ప్రస్తావన..

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీలో సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో బీజేపీ, ఎంఐఎం ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. పార్టీలోని ఆశావహులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశాన్ని కూడా ఎత్తలేదు. సమావేశం ముగిసిన తర్వాత డీసీసీబీ, డీసీఎంఎస్‌, జడ్పీ చైర్‌పర్సన్లతో సీఎం వేర్వేరుగా భేటీ అయ్యారు. వచ్చే బడ్జెట్‌లో జిల్లా పరిషత్‌లకు నిధులు కేటాయిస్తామని, ఒక్కో జడ్పీ చైర్‌పర్సన్‌ పరిధిలో ఏటా రూ.10 కోట్ల నిధులు అందుబాటులో ఉంచుతామని అన్నారు. 


Updated Date - 2021-02-08T08:44:25+05:30 IST