కొన్ని విషయాలు బయటికి చెప్పలేను.. : కేసీఆర్

ABN , First Publish Date - 2021-02-08T14:12:00+05:30 IST

కొన్ని విషయాలు బయటికి చెప్పలేనని, ఎవరితో ఎలా మాట్లాడింది షేర్‌ చేసుకోలేనని పార్టీ నేతలతో కేసీఆర్‌ అన్నారు.

కొన్ని విషయాలు బయటికి చెప్పలేను.. : కేసీఆర్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కొన్ని విషయాలు బయటికి చెప్పలేనని, ఎవరితో ఎలా మాట్లాడింది షేర్‌ చేసుకోలేనని పార్టీ నేతలతో కేసీఆర్‌ అన్నారు. ‘‘కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని విషయాలు మీతో పంచుకోలేను. నేను రాష్ట్రాన్ని, పార్టీని కాపాడుకోవాలి. అందుకే కొన్నింటిని మీతో ఓపెన్‌గా చెప్పలేకపోతున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని, నెలాఖరు వరకు పూర్తి చేయాలని అన్నారు. గతంలో కంటే ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేయించాలన్నారు. సభ్యత్వ నమోదు కోసం జిల్లాల వారీగా ఇన్‌చార్జులను ప్రకటించారు. ఏప్రిల్‌లో తాను అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం చెప్పారు. పోడు భూముల సమస్యను స్వయంగా తానే పరిష్కరిస్తానని, ఎవరూ తొందరపడి మాట్లాడవద్దని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండాలని, విపక్షాల ఆరోపణల్ని తిప్పికొట్టాలని ఆదేశించారు.


రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి సిటింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ప్రకటించారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానానికి అభ్యర్థిని జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ముగిశాక ప్రకటిస్తామన్నారు. రెండు స్థానాలనూ టీఆర్‌ఎస్‌ గెలుచుకోవాలని, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. 


ఆదివారం టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులు హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్‌ నేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వివిధ అంశాలపై మాట్లాడారు.

Updated Date - 2021-02-08T14:12:00+05:30 IST