అబ్బాయిలకో న్యాయం.. అమ్మాయిలకో న్యాయమా?

ABN , First Publish Date - 2021-10-20T08:45:03+05:30 IST

అబ్బాయిలకో న్యాయం.. అమ్మాయిలకో న్యాయమా?

అబ్బాయిలకో న్యాయం.. అమ్మాయిలకో న్యాయమా?

 బుర్ఖా లేని అమ్మాయితో ముస్లిం అబ్బాయి ఉంటే పట్టించుకోరు

 బుర్ఖా వేసిన అమ్మాయి మరొకరితో కనిపిస్తే దాడి చేస్తారా ? 

 ఉగ్రవాదులు సైనికులను చంపుతుంటే..  పాక్‌తో టీ20 మ్యాచ్‌ ఆడతారా ? 

 చైనా గురించి మాట్లాడే ధైర్యం ప్రధానికి లేదు: అసదుద్దీన్‌


హైదరాబాద్‌,  అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ముస్లిం అబ్బాయి అయితే ఎవరితోనైనా తిరుగొచ్చా? ముస్లిం అమ్మాయి అయితే అలా ఉండకూడదా? అబ్బాయిలకో న్యాయం.. అమ్మాయిలకో న్యాయమా ?’’ అని మీలాదున్‌ నబీ సందర్భంగా సోమవారం రాత్రి దారుస్సలాంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా ఆయన ప్రశ్నించారు. ‘‘బుర్ఖా వేసుకోని అమ్మాయితో ముస్లిం అబ్బాయి తిరిగితే పట్టించుకోరు.. బుర్ఖా ధరించిన అమ్మాయి మరొకరితో కనిపిస్తే దాడి, దౌర్జన్యం చేస్తారా? అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళుతుంటే నిలువరించేందుకు మనకు హక్కు ఎక్కడిది?’’ అని అసద్‌ పేర్కొన్నారు. ఈవిధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మంచిది కాదని.. ఏదైనా విషయాన్ని చెప్పదల్చుకుంటే అవమానకర రీతిలో కాకుండా గౌరవప్రదంగా సూచిస్తే మంచిదని యువతకు హితవు పలికారు. ఓ వైపు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మన సైనికులను పొట్టన పెట్టుకుంటుంటే.. ఆ దేశంతో టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటం అవసరమా అని ప్రధాని మోదీని ఒవైసీ ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ఇటీవల 9 మంది సైనికులు అమరులైన ప్రస్తుత తరుణంలో అక్టోబరు 24న పాకిస్థాన్‌తో టీ20 మ్యాచ్‌కు ప్రధాని మోదీ అనుమతించడం శోచనీయమన్నారు. భారత ప్రజల జీవితాలతో పాకిస్థాన్‌ ప్రతిరోజూ కశ్మీర్‌లో 20-20 ఆడుతోందని, ఈనేపథ్యంలో ఇండియా-పాకిస్థాన్‌ టీ20 మ్యాచ్‌పై పునరాలోచించాలని ఒవైసీ కోరారు. లద్దాఖ్‌లోని భారత భూభాగంలో చైనా దురాక్రమణ గురించి, పెట్రోలు, డీజిల్‌ ధరల భారీ పెరుగులపై ప్రధాని మోదీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదన్నారు. లద్దాఖ్‌లోని భారత భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకొని వచ్చి తిష్ట వేసినా ప్రధాని మోదీ స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. చైనా గురించి మాట్లాడేందుకు మోదీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.


వివక్ష చూపుతున్న మంత్రులకు సత్తా చూపిస్తాం 

తెలంగాణలో 2019 ఎన్నికల్లో మజ్లిస్‌ మద్దతుతో గెలిచిన పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు వివక్ష చూపుతున్నారని అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. వివక్ష ప్రదర్శిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల విషయంలో 2023 ఎన్నికల్లో మజ్లిస్‌ సత్తా ఏమిటో చూపించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలు ముగిసి మూడేళ్లు గడుస్తున్నాయని, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోవడం లేదని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-20T08:45:03+05:30 IST