ఫలించిన సీఎం కేసీఆర్‌ వ్యూహం

ABN , First Publish Date - 2021-03-21T08:11:46+05:30 IST

టీఆర్‌ఎ్‌సలో పట్టభద్రులు జోష్‌ను నింపారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల తర్వాత రాజకీయ ఒడిదుడుకులు తప్పవనుకున్న సమయంలో దక్కిన ఈ విజయాలు తమకు బూస్ట్‌లా పనిచేస్తాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఫలించిన సీఎం కేసీఆర్‌ వ్యూహం

  • టీఆర్‌ఎస్‌లో జోష్‌
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికతో లబ్ధి
  • బీజేపీ దూకుడుకు పట్టభద్రుల బ్రేక్‌!
  • ఓడిపోతారనే మాటలతో మొదలై.. 
  • గెలుపు తీరాన్ని ముద్దాడిన అధికార పార్టీ’

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎ్‌సలో పట్టభద్రులు జోష్‌ను నింపారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల తర్వాత రాజకీయ ఒడిదుడుకులు తప్పవనుకున్న సమయంలో దక్కిన ఈ విజయాలు తమకు బూస్ట్‌లా పనిచేస్తాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇది నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో తమ సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటానే ధీమాను కల్పించిందని చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రెండు స్థానాల్లోనూ ఓడిపోతుందనే ప్రచారం తొలుత జరిగింది. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉండటం అందుకు కారణమనే విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి ప్రచార ప్రణాళిక ఖరారు, పర్యవేక్షణలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నల్లగొండ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మళ్లీ దింపితే ఓటమి తప్పదని చాలా మంది సొంత పార్టీ నేతలు కూడా పెదవి విరిచినా.. సీఎం కేసీఆర్‌ ఆయనకే అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికలకు చాలా ముందుగానే మూడు ఉమ్మడి జిల్లాల మంత్రులు, పార్టీ ప్రజ్రాపతినిధులు, నాయకులకు ఈ మేరకు సంకేతాలిచ్చారు. పల్లాను తిరిగి గెలిపించకపోతే మంత్రి పదవులు కూడా ఉండవని ఒక దశలో ఆయా జిల్లాల మంత్రులను హెచ్చరించారు. దీంతో టీఆర్‌ఎస్‌ యంత్రాంగం యావత్తూ గెలుపు కోసం శ్రమించింది. మరోవైపు పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వయంగా విద్యాసంస్థల అధినేత కావడంతో తమ సిబ్బందిని పెద్దఎత్తున పార్టీ ప్రచారంలో మోహరించారు. ఇక హైదరాబాద్‌ స్థానంలో సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణీదేవిని తెరపైకి తెచ్చారు. దీంతో వాణీదేవి మరో శంకరమ్మ అవుతుందనే ప్రచారం జరిగింది. పీవీ కుటుంబాన్ని అవమానించటానికే ఓడిపోయే సీటులో వాణీదేవికి టికెట్‌ ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.


సాధారణ ఎన్నికల కన్నా ఎక్కువగా..

ఒక రకంగా సాధారణ ఎన్నికల కంటే ఎక్కువగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ పరుగులు పెట్టించారు. ఉద్యోగ, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘాలు, కుల సంఘాలు సహా ఏ ఒక్క సంఘాన్నీ వదిలిపెట్టకుండా, వాటి మద్దతు కూడగట్టారు. నమోదు చేయించిన ప్రతి ఓటరు పోలింగ్‌ కేంద్రానికి చేరి, ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు. పైగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగడం కూడా టీఆర్‌ఎ్‌సకు కలిసివచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయినట్లుగా ఫలితాల ద్వారా స్పష్టమయిందంటున్నారు. రెండు స్థానాల్లోనూ మొదటి ప్రాధాన్య ఓట్లు పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక మలుపుగా నిలిచాయి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తమకు మేలు చేశాయని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అంటున్నారు. ఉద్యోగుల డిమాండ్లలో కీలకమైన పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపు వంటి వాటికి సీఎం కేసీఆర్‌ సానుకూలత వ్యక్తం చేయడం, 50వేల కొత్త ఉద్యోగాల భర్తీతోపాటు, నిరుద్యోగ భృతి చెల్లిస్తామనడం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తెను బరిలోకి దించడంతో కాంగ్రెస్‌ అభిమానులు కొందరు వాణిదేవికి ఓటు వేసినట్లు, రెండో ప్రాధాన్య ఓటుకు ఆమెనే ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఇక తాజా ఫలితాలతో 40 మంది సభ్యుల శాసనమండలిలో టీఆర్‌ఎస్‌ బలం 35కు చేరనుంది.


కాంగ్రెస్‌ కుదేలు..

ఇప్పటికే వలసలతో కుదేలైన కాంగ్రెస్‌ పార్టీని వరుస ఓటములు ఎదురవుతుండడంతో ఎటూ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా చెప్పుకొంటున్న కాంగ్రెస్‌.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఓటమికి కేరాఫ్‌ అడ్ర్‌సగా మారినట్లయింది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిస్తేజానికి గురిచేస్తోంది. అయితే ఇంత ప్రతికూలతలోనూ ఒక విషయంలో వారు ఊరటపొందుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటా అధికార టీఆర్‌ఎస్‌ గెలుపొందడం, తమతోపాటు బీజేపీ కూడా ఓడిపోవటం కాంగ్రెస్‌ ముఖ్యులకు కొంత ఊరట కలిగిస్తోంది. సాగర్‌లో గెలుపొందడం ద్వారా మళ్లీ టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయ రేసులో బీజేపీని వెనక్కి నెట్టుతామనే ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు ‘సాగర్‌’లో తాము కచ్చితంగా గెలవాల్సి ఉంటుందని, తద్వారా బీజేపీకే కాకుండా టీఆర్‌ఎ్‌సకు కూడా గుణపాఠం చెప్పినట్లు అవుతుందని అంటున్నారు. టీపీసీసీలోని లుకలుకలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి ఒక కారణమనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కొందరు నేతలు నాయకత్వ బాధ్యతల కోసం వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకోవడంపై పెడుతున్న శ్రద్ధను పార్టీ బలోపేతంపై పెట్టడంలేదని అంటున్నారు. ముఖ్యనేతల రైతుయాత్రలు ముగిసిన తర్వాత కూడా పార్టీ నుంచి వలసలు ఆగకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వంలో, కేడర్‌లో విశ్వాసం కల్పించలేకపోతున్నారని, అందుకే ‘హైదరాబాద్‌’లో చిన్నారెడ్డి వంటి సీనియర్‌ నేతను నిలిపినా గట్టి పోటీ ఇవ్వకుండానే ఓడిపోయారని అంటున్నారు. 


కోదండకు కలిసి రాని ఎన్నికలు..

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసి రాలేదు. ఈ ఎన్నికల్లో తన పోటీపై తొలుత కొంతకాలం ఆయన సందిగ్ధంలో ఉన్నప్పటికీ, చివరికి పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అంతకంటే, ముందుగానే కోదండరాం నల్లగొండలో టీజేఎ్‌సపై ఎవరూ పోటీ పెట్టవద్దని కాంగ్రెస్‌, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలను కలిసి అభ్యర్థించారు. కానీ వారి మధ్య పొత్తు చర్చలు కొలిక్కి రాలేదు. నల్లగొండలో పోటీ చేయకపోతే, ‘హైదరాబాద్‌’లో మద్దతు ఇస్తామని కమ్యూనిస్టులకు కోదండరాం ఆఫర్‌ ఇచ్చారు. దానిని సీపీఐ తిరస్కరించి, అక్కడ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఆ అభ్యర్థికే సీపీఎం మద్దతు ఇచ్చింది. ‘హైదరాబాద్‌’లో స్వంతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో కోదండరాం విధిలేని పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థికి ‘హైదరాబాద్‌’లో మద్దతు ప్రకటించారు. ‘నల్లగొండ’లో ఆ పార్టీ మద్దతు తీసుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని ఆ పార్టీ పెట్టిన మెలికకు కోదండరాం అంగీకరించలేదు. 


దీంతో అక్కడా కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఆయన ఒంటరి పోరాటం చేయక తప్పలేదు. విపక్షాల నుంచి టీజేఎస్‌ ఒక్కటే బరిలో ఉంటే, టీఆర్‌ఎ్‌సను ఓడించటం సులువవుతుందని ఆ పార్టీ వర్గాలు భావించాయి. తెలంగాణ మలి దశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కోదండరాం తమ పార్టీ అధ్యక్షుడి హోదాలో స్వయంగా పోటీకి దిగటం వల్ల గెలుపు అసాధ్యం కాదని అనుకున్నారు. అందుకే ఆ పార్టీ వర్గాలు చివరి వరకు విజయంపై ధీమాతో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న రూపంలో కోదండరాంపై రాజకీయంగా గట్టి దెబ్బ పడింది. మొదటి స్థానంలో ఉంటారనుకున్న కోదండరాంను మల్లన్న మూడవ స్థానంలోకి నెట్టివేయటాన్ని టీజేఎస్‌ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ పరిణామాల నుంచి టీజేఎస్‌ ఇప్పట్లో కోలుకోవటం అంత ఈజీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఓటర్ల నమోదు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి చురుగ్గా పనిచేసిన అభ్యర్థులు కూడా ఓడిపోయిన వారిలో ఉన్నారు. ఇందులో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమరెడ్డి ముఖ్యులు. వీరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రచారం నిర్వహించారు. ఒకరకంగా చెప్పాలంటే, బీజేపీని మించి ప్రచారం సాగించారు. అయినప్పటికీ, ఎవరికి కూడా ప్రథమ ప్రాధాన్య ఓట్లు 10వేలు  దాటలేదు. మరోవైపు ఈ ఎన్నికల్లో సోషల్‌ మీడియా కీలకమైన పాత్ర పోషించింది. అభ్యర్థులు ప్రత్యక్ష ప్రచారం కోసమే కాకుండా, సోషల్‌ మీడియా ప్రచారం కోసం పెద్దఎత్తున ఖర్చు పెట్టారు.

Updated Date - 2021-03-21T08:11:46+05:30 IST