తొలి తప్పునకు కౌన్సెలింగ్‌, బదిలీ!

ABN , First Publish Date - 2021-02-08T08:58:36+05:30 IST

ఆర్టీసీలో ఉద్యోగ భద్రత మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.

తొలి తప్పునకు కౌన్సెలింగ్‌, బదిలీ!

రెండోసారి ఇంక్రిమెంట్‌ కోత, వేతన తగ్గింపు..

మూడోసారి జరిగితే సస్పెన్షన్‌, రిమూవల్‌

ఆర్టీసీలో ఉద్యోగ భద్రత మార్గదర్శకాలు జారీ

శిక్షల అమలు తప్ప ఉద్యోగ భద్రతేదీ?: ఈయూ

ఉద్యోగ భ్రష్టతా మార్గదర్శకాలు: ఎస్‌డబ్ల్యూఎఫ్‌


హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో ఉద్యోగ భద్రత మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ ఈ అంతర్గత ఉత్తర్వులను శనివారమే జారీ చేసినప్పటికీ మంత్రి ఆదివారం విడుదల చేశారు. ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉద్యోగ భద్రత మార్గదర్శకాలపై కసరత్తు చేసి, తుది నివేదికను సీఎంకు సమర్పించారు. ఈ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచే అమల్లోకి వచ్చిట్లని సునీల్‌ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులకు కూడా ఈ కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపారు.


6 నెలల తర్వాత మార్గదర్శకాలను సమీక్షిస్తామని, మార్పులు చేర్పులుంటే పరిశీలిస్తామని వెల్లడించారు. టికెట్‌ ఇవ్వకుండా, డబ్బు వసూలు చేయకుండా పట్టుబడిన కేసులు, టికెట్‌ రహిత ప్రయాణికులు బస్సుల్లో ఉండడం, తక్కువ విలువ చేసే టికెట్లు ఇవ్వడం, టికెట్‌ ఇవ్వకుండా డబ్బు వసూలు చేయడం వంటి కేటగిరీల్లో అమలు చేసే శిక్షలను ఉత్తర్వుల్లో విపులీకరించారు. అయితే బస్సుల్లో టికెట్‌ తీసుకునే బాధ్యత ప్రయాణికులదేనని, టికెట్‌ తీసుకోని వారికి రూ.500 జరిమానా విధించే పాత నిబంధన కొనసాగుతుందని వెల్లడించారు.


ఇవీ కొత్త మార్గదర్శకాలు..

బస్సులో 100 శాతానికి మించి ప్రయాణికులు ఉండి, ఐదుగురిలోపు ప్రయాణికుల నుంచి డబ్బు తీసుకోకుండా, టికెట్‌ ఇవ్వకుండా ఉంటే.. మొదటి తప్పు కింద కండక్టర్‌, టిమ్‌ డ్రైవర్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించి వదిలేస్తారు. అదే తప్పు రెండోసారి జరిగితే రెండేళ్ల వరకు ఇంక్రిమెంట్‌ కోత పెడతారు. మూడోసారి జరిగితే ఇంక్రిమెంట్‌లో కోత లేదా వేతనం తగ్గింపు వంటి చర్యలు తీసుకుంటారు.

బస్సులో 50-100% మధ్యలో ప్రయాణికులు ఉండి, టికెట్‌ లేని ప్రయాణికులు ఇద్దరి వరకు ఉంటే.. మొదటి తప్పు కింద కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. రెండో తప్పు కింద రెండేళ్ల వరకు ఇంక్రిమెంట్‌ కోత విధిస్తారు. మూడో తప్పు కింద ఇంక్రిమెంట్‌లో కోత లేదా వేతనాల్లో తగ్గింపు.

బస్సులో 50 శాతం కంటే తక్కువగా ప్రయాణికులు ఉండి, టికెట్‌ రహిత ప్రయాణికులు ఉన్నట్లయితే.. కండక్టర్‌/టిమ్‌ డ్రైవర్‌ను డిపో స్పేర్‌లో పెట్టి, ఇతర విధులు అప్పగిస్తారు. ఇంక్రిమెంట్‌ కోత, వేతనంలో తగ్గింపు ఉంటాయి.

సిటీ ఆర్డినరీ, సబర్బన్‌, మొఫసిల్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, పల్లెవెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్‌ వంటి బస్సుల్లో డబ్బు వసూలు చేసి, టికెట్‌ ఇవ్వకపోతే.. వసూలు చేసిన సొమ్ము కనీస చార్జీ కంటే రెండింతల లోపు ఉంటే మొదటి తప్పు కింద సస్పెన్షన్‌ ఉండదు. కేసు తీవ్రతను బట్టి ఇంక్రిమెంట్‌ కోత, వేతన తగ్గింపు ఉంటాయి. రెండోసారి అదే తప్పు జరిగితే బదిలీ, ఇంక్రిమెంట్‌ కోత, వేతన తగ్గింపు అమలవుతాయి. మూడో సారీ జరిగితే సస్పెండ్‌ చేస్తారు. అవసరమైతే సర్వీసు నుంచి తొలగిస్తారు. 

డబ్బు వసూలు చేసి, తక్కువ విలువ చేసే టికెట్‌ ఇచ్చినట్లయితే ఆర్డినరీ బస్సుల్లో మొదటి తప్పు కింద సస్పెన్షన్‌ ఉండదు. ఇంక్రిమెంట్‌ కోత, వేతన తగ్గింపు ఉంటాయి. రెండో తప్పునకు బదిలీ, వేతన కోతలు, తగ్గింపులుంటాయి. మూడో తప్పు జరిగితే సస్పెన్షన్‌, రిమూవల్స్‌, కోతలు, తగ్గింపులు అమలవుతాయి. అదే ఏసీ బస్సుల్లో తక్కువ చార్జీ టికెట్‌ను ఇస్తే సస్పెన్షన్‌, రిమూవల్‌ ఉంటాయి.

ఇచ్చిన టికెట్‌ను మళ్లీ మరో వ్యక్తికి ఇస్తే సస్పెన్షన్‌, రిమూవల్‌ ఉంటాయి. ప్రయాణికుడి లగేజీ ఫేర్‌ను వసూలు చేసి టికెట్‌ ఇవ్వకపోయినా, తక్కువ విలువ చేసే టికెట్‌ ఇచ్చినా ఇంక్రిమెంట్‌ కోత, వేతన తగ్గింపు, సస్పెన్షన్‌, రిమూవల్స్‌ వంటి చర్యలు తీసుకుంటారు. 

ఫ బస్సు ప్రమాదాల్లో ప్రజల మరణాలకు డ్రైవర్లు కారణమని తేలితే సస్పెండ్‌ చేస్తారు. రిమూవల్‌ కూడా చేసే అవకాశం ఉంటుంది. పెద్ద ప్రమాదాలు జరిగి, కొంత మందికి గాయాలైతే సస్పెండ్‌ చేయరు. కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే సస్పెన్షన్‌, రిమూవల్‌ ఉంటుంది. మద్యం సేవించి విధులు నిర్వహిస్తే సస్పెన్షన్‌, రిమూవల్స్‌ తప్పవు.


ఇదో సువర్ణాధ్యాయం: పువ్వాడ

ఆర్టీసీలో ఉద్యోగ భద్రత మార్గదర్శకాలను అమలు చేయడం ఒక సువర్ణాధ్యాయమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ప్రస్తుతం టికెట్ల అమ్మకం ద్వారా రోజూ రూ.10 కోట్ల మేర ఆదాయం వస్తోందని, దీన్ని 13 కోట్లకు పెంచడానికి సిబ్బంది కృషి చేయాలని పువ్వాడ సూచించారు. 


ఇది ఉద్యోగ భద్రతా?: ఈయూ 

ఉద్యోగ భద్రత ఉత్తర్వులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కూడా లేదని ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి విమర్శించారు. ఉత్తర్వుల్లో ఏ రకంగా శిక్షలను అమలు చేయాలన్నది చెప్పారే తప్ప భద్రత గురించి ఎక్కడా చెప్పలేదన్నారు. ఇంక్రిమెంట్లలో కోత పెట్టడం, వేతనాలను తగ్గించడం ఉద్యోగ భద్రత ఎలా అవుతుందని ప్రశ్నించారు. మెరుగైన మార్గదర్శకాలను జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.


భద్రత కాదు భ్రష్టత: ఎస్‌డబ్ల్యూఎఫ్‌

ఇవి ఉద్యోగ భద్రత మార్గదర్శకాలు కావని, ఉద్యోగ భ్రష్టతా మార్గదర్శకాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు విమర్శించారు. టికెట్టు తీసుకునే బాధ్యత ప్రయాణికుడిదేనని సీఎం కేసీఆర్‌ చెప్పారని, దానికి భిన్నంగా సిబ్బందినే బాధ్యుల్ని చేస్తూ ఉద్యోగ భద్రత మార్గదర్శకాలను రూపొందించారని ఆరోపించారు. చేయని తప్పుకు ఉద్యోగులను బలి చేయకూడదని, వీటిలో సమూల మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-02-08T08:58:36+05:30 IST