ఏఐజీ ఆస్పత్రికి జేసీఐ గోల్డ్‌ సీల్‌

ABN , First Publish Date - 2021-12-25T08:28:43+05:30 IST

హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి మరో విశిష్ట గుర్తింపు

ఏఐజీ ఆస్పత్రికి జేసీఐ గోల్డ్‌ సీల్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి మరో విశిష్ట గుర్తింపు దక్కింది. రోగుల భద్రత, వైద్యసేవల్లో నాణ్యతా ప్రమాణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న అమెరికాకు చెందిన జాయింట్‌ కమిషన్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ) సంస్థ ఏఐజీ ఆస్పత్రికి గోల్డ్‌ సీల్‌ అప్రూవల్‌ను అందించింది. ఆస్పత్రిలోని వైద్యులు, నర్సులు, అడ్మినిస్ట్రేషన్‌ విభాగం వంటి 1300 అంశాలను ఐదు రోజుల పాటు విశ్లేషణ చేసిన అనంతరం ఈ అక్రెడిటేషన్‌ను జేసీఐ ప్రకటించింది.


రోగుల భద్రతా ప్రమాణాలు, ఇన్ఫెక్షన్‌ కట్టడి, రోగి ఆరోగ్యాన్ని మదించే తీరు, సర్జికల్‌ కేర్‌, మెడికేషన్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలు ప్రాతిపదికగా ఏఐజీ ఆస్పత్రిని ఇందుకు ఎంపిక చేసింది. ‘‘అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను మేం తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాం. మా అంకితభావానికి, శ్రమకు జేసీఐ గుర్తింపు వన్నె తెచ్చింది.’’ అని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-25T08:28:43+05:30 IST