‘నెట్టెంపాడు’కు గ్రహణం
ABN , First Publish Date - 2021-08-31T06:02:11+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సమస్యల వలయంలో
- ప్రమాదపు అంచున ర్యాలంపాడు రిజర్వాయర్ కట్ట..
- ఊటనీరు ఉబికి వస్తుండటంతో రైతుల్లో ఆందోళన
- నీటి నిల్వ సామర్థ్యం 1.15 టీఎంసీలు తగ్గింపు
- 2 లక్షల ఎకరాలకుగానూ.. సాగు అంచనా 40వేల ఎకరాలే
గద్వాల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రాజెక్టు చేపట్టి దశాబ్దకాలం గడుస్తున్నా మెజారిటీ ఆయకట్టుకు నీరందించే కాలువలు పూర్తికాకపోవడం ఒక సమస్య అయితే.. పూర్తయిన రిజర్వాయర్లలో లీకేజీలు, కట్ట దెబ్బతినడం, షటర్లు పనిచేయకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తాజాగా ఈ స్కీంలో ప్రధానమైన రిజర్వాయర్‌గా ఉన్న ర్యాలంపాడు కట్ట లీకేజీల కారణంగా దెబ్బతింటోంది. ఈ రిజర్వాయర్ 2014లోనే పూర్తయినప్పటికీ 2018 సంవత్సరం వరకు 2 టీఎంసీల మేర నీటినే నింపేవారు. మూడేళ్లుగా వరద ఎక్కువగా వస్తుండటంతో 4 టీఎంసీల వరకు నింపి ఆయకట్టుకు నీరందిస్తున్నారు.
వందల ఎకరాల్లో పంటనష్టం..
తాజాగా ర్యాలంపాడు రిజర్వాయర్ కట్టకు లీకేజీలు ఏర్పడి ఉబికి వస్తున్న నీటితో కట్ట దెబ్బతింటుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో ఇదే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మొదటి రిజర్వాయర్‌గా ఉన్న గూడెందొడ్డి జలాశయం వద్ద కాలువ తెగిపోయి వందలాది ఎకరాల్లో పంట దెబ్బతినడంతో పాటు ఇసుక మేటలు పేరుకుపోయాయి. దీంతో ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 1.7 టీంఎసీలు కాగా ప్రస్తుతం 0.7 టీఎంసీల నీటినే నిల్వ ఉంచారు. తాజాగా ర్యాలంపాడు లీకేజీలతో పూర్తిస్థాయి సామర్థ్యం 4 టీఎంసీలు కాగా 2.85 టీఎంసీలకు నిల్వను కుదించారు. దీంతో ఆయకట్టు 2లక్షల ఎకరాలకుగానూ 50వేల ఎకరాలు మాత్రమే ఈ ఏడాది సాగయ్యే అంచనాలు ఉన్నాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు ఇప్పటికే ఆయకట్టుకు ఇబ్బందులు రానివ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే కట్ట లీకేజీలు అరికట్టడానికి గతంలో జూరాల వద్ద గ్రౌటింగ్ పద్ధతిని పాటించారు. మట్టికట్టపై పలుచోట్ల బోరు వేసి సిమెంట్ కాంక్రీట్‌ను నింపడం వల్ల ఊట సమస్యను అరికట్టవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కట్ట పూర్తిస్థాయి నిల్వను తట్టుకునే పరిస్థితి లేకపోతే. లీకేజీలు అవుతున్న భాగాన్ని కొంతమేర తొలగించి మళ్లీ నిర్మించాలనే డిమాండ్ కూడా ఉంది.
గూడెందొడ్డి పరిస్థితి అగమ్యగోచరం..
ఈ సంవత్సరం నెట్టెంపాడు కింద సాధ్యమైనంత నీటిని తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించారు. ఒక్క జూన్ నెలలో 1.854 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేశారు. జూన్, జూలై నెలలు కలిపి 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేశారు. అందులో దాదాపు 0.9 టీఎంసీల నీరు స్టేజ్ 1లో ఉన్న గూడెందొడ్డి రిజర్వాయర్‌లో నింపారు. ఈ జలాశయం సామర్థ్యం 1.1 టీఎంసీలు కాగా, దాదాపు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) కు చేరువగా నింపారు. అయితే అధికారులు, కొందరు స్థానిక నేతలు నిర్మాణం పూర్తికా ని కాలువకు కూడా నీటిని విడుదల చేశారు. దీంతో నీరు వెళ్లే మార్గం లేక షటర్ల సమీపంలోనే గండిపడింది. దాదాపు 600 ఎకరాల పంట నీటమునిగిపోగా 100 ఎకరాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. 99 ప్యాకేజీ కాలువ షటర్లు కిందకు దిగపోవడంతో.. కాలువ నీటిని మళ్లించి దిగువన ఉన్న అప్రోచ్ కెనాల్‌లోకి నీటిని వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.7 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఆయకట్టు పరిధిలోని దాదాపు 60వేల ఎకరాలకు నీరివ్వాలి. ర్యాలంపాడు కట్ట తెగితే దాదాపు 20 గ్రామాలు ముంపునకు గురయ్యే ముప్పు పొంచి ఉంది.
ప్రభుత్వానికి నివేదించాం
ర్యాలంపాడు కట్ట లీకేజీలను గుర్తించాం. గతంలో కట్ట చుట్టూ కంపచెట్లు ఉండటంతో ఆ విషయం తెలియలేదు. ఇటీవల ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) స్వయంగా వచ్చి పరిశీలించి ఆ సమాచారాన్ని సేకరించారు. ప్రభుత్వానికి నివేదించాం. ఆదేశాలు వచ్చిన వెంటనే లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాసరావు, ఈఈ, ర్యాలంపాడు