సమస్యలపై గళమెత్తిన సభ్యులు
ABN , First Publish Date - 2021-12-31T05:40:02+05:30 IST
సమస్యలపై గళమెత్తిన సభ్యులు

వాడి వేడిగా జనగామ మున్సిపల్ సమావేశం
నిధుల మంజూరులో వివక్ష చుపుతున్నారని
పోడియం వద్ద బీజేపి కౌన్సిలర్ల నిరసన
జనగామ టౌన్, డిసెంబరు 30 : జనగామ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. సభ్యుల ఆగ్రహాలు, సమస్యల నిలదీతలతో, అధికారుల తీరుపై నిరసనలతో సభ దద్ధరిల్లింది. జనగామ కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాలులో చైర్‌పర్సన్ పోకల జమున అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభ ప్రారంభంలోనే ఎజెండాలోని అంశాలు ప్రతిపాదించి ఆమోదింపచేశారు. బీజేపీ కౌన్సిలర్లు బొట్ల శ్రీనివాస్, మహంకాళి హరిశ్చంద్రగుప్త, ప్రేమలతారెడ్డి, ఉడుగుల శ్రీలత తదితరులు సమస్యలపై గళం విప్పి, మాట్లాడారు. అభివృద్ధి పనుల నిధుల మంజూరు అధికార పార్టీ కౌన్సి లర్ల వార్డులకు పరిమితం చేశారని వివరించారు. అన్ని వార్డులకు సమానం గా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పోడియం ముందుకు దూసుకొచ్చి ఎమ్మెల్యే, అధికారులతో వాగ్వాదానికి దిగారు.
కౌన్సిలర్ జక్కుల అనిత, 6వ వార్డు కౌన్సిలర్ వంగాల కల్యాణి మాట్లాడుతూ తమవార్డు సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆరోవార్డులో రూ.5 లక్షల పనులకు రూ.లక్షకు మాత్రమే చేసి, మొత్తం బిల్లును స్వాహా చేశారని ఆరోపించారు. మున్సిపల్‌లో పారిశుధ్య సమస్య అధ్వాన్నంగా మారిందని కౌన్సిలర్లు జీ మల్లేశం, అనిత, సుమలత, రాంచందర్ తదితరులు ఆరోపించారు.
కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మారబోయిన పాండు మాట్లాడుతూ మున్సిపల్‌కు మంజూరైన నిధులు అధికారుల నిర్లక్ష్యంతో మురిగిపోయే ప్రమాదం ఏర్పడుతుందని, మిగులు నిధులు వెంటనే ఖర్చు చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే మరికొందరు కౌన్సిల ర్లు పలు సమస్యలపై గళం విప్పారు. 16వ వార్డు కౌన్సిలర్ గాదెపాక రాం చందర్, టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ తాళ్ల సురే్‌షరెడ్డి, కమిషనర్ కె.నర్సింహ, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, డీఈ చంద్రమౌళి, మేనేజర్ రాజు, కౌన్సిలర్లు ఎండీ సమద్, స్వరూప, సుమలత, కర్రె శ్రీను, చందర్, విష్ణువర్ధన్ రెడ్డి, మసీ ఉర్‌రెహమాన్, కమలమ్మ పాల్గొన్నారు.
మునిసిపాలిటీని ఆద్శరంగా తీర్చిదిద్దుతా..
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
జిల్లా కేంద్రానికి అనుగుణంగా జనగామ మున్సిపాలిటీ అభివృధ్ధికి రాష్ట్ర స్థాయిలో ఆదర్శ మున్సిపల్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల చేయూత అం దిస్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో రింగురోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధుల మంజూరు కోసం శాయశక్తులా కృషి చేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్‌లో పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్‌లను గుర్తించి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి రాజకీయాలకు అతీతంగా జనగామ మున్సిపాలిటీని రాష్ట్రస్థాయిలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు.