జగన్‌ కేసుల్లో అభ్యంతరాలకు దర్యాప్తు అధికారే బదులిస్తారు

ABN , First Publish Date - 2021-01-13T08:35:33+05:30 IST

జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణను సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు మంగళవారం మరోసారి విచారించారు

జగన్‌ కేసుల్లో అభ్యంతరాలకు దర్యాప్తు అధికారే బదులిస్తారు

ఆధారాలన్నీ సేకరించాకే చార్జిషీటు: సీబీఐ


జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణను సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు మంగళవారం మరోసారి విచారించారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించి దాఖలు చేసిన చార్జిషీటులో అభియోగాలపై సీబీఐ వాదనలు వినిపించింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించి జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లలో లేవనెత్తిన అభ్యంతరాలకు కేసు విచారణలో దర్యాప్తు అధికారి వివరణ ఇస్తారన్నారు. సమగ్ర ఆధారాలు సేకరించిన మీదటే చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపారు.


ఈ కేసులో ఐటీ శాఖ సమర్పించిన నివేదికపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ, పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు. ఈ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి.. స్టే ఉన్న నివేదికలను ఏ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకోవచ్చో చెప్పాలన్నారు. ఇందుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానాలిచ్చిన తీర్పులుంటే కోర్టుకు దృష్టికి తేవాలని సూచించారు. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ల విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు. రాంకీ, వాన్‌పిక్‌ సంస్థలపై దాఖలైన చార్జిషీట్లపై విచారణను 19కి, భారతీ సిమెంట్స్‌ విచారణ  20కి, పెన్నా సిమెంట్స్‌ విచారణను 22కి వాయిదా వేశారు. పెన్నా, భారతీ సిమెంట్స్‌ కేసుల్లో జగన్‌, విజయసాయిరెడ్డి వాదనలు చివరిగా వింటామన్న న్యాయమూర్తి.. తొలుత ఇతర నిందితుల వాదనలు వింటామన్నారు.

Updated Date - 2021-01-13T08:35:33+05:30 IST