జగన్‌ కేసులపై హైకోర్టులో రోజువారీ విచారణ

ABN , First Publish Date - 2021-10-28T09:38:38+05:30 IST

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని ..

జగన్‌ కేసులపై హైకోర్టులో రోజువారీ విచారణ

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టులో విచారణలో ఉన్న 12 చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న పలు సంస్థలు, వ్యక్తులు తమపై నమోదైన కేసులను కొట్టేయాలని, స్టే ఉత్తర్వులు పొడిగించాలని కోరుతూ రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై రోజువారీగా విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ ధర్మాసనం తెలిపింది.  పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వినోద్‌ దేశ్‌పాండే, టీ నిరంజన్‌రెడ్డి, శివరాజ్‌ శ్రీనివాస్‌, నవీన్‌కుమార్‌లు వాదిస్తూ బుధవారంతో ముగియనున్న స్టే ఉత్తర్వుల గడువును వారం రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జడ్చర్లలో భూకేటాయింపులకు ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో హెటిరో, అరబిందో కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని ఆరోపిస్తూ సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులు కొట్టేయాలని కోరుతూ ఆ కంపెనీలు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశాయి.

 

చంద్రమౌళి మృతిని కోర్టుకు వెల్లడించని ఈడీ

జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడు పీఎస్‌ చంద్రమౌళి మృతి చెందిన విషయాన్ని ఈడీ నాంపల్లి సీబీఐ కోర్టుకు వెల్లడించలేదు. నాంపల్లి కోర్టులో జగతి పబ్లికేషన్స్‌, రాంకీ, హెటిరో తదితర కేసులు వేర్వేరుగా విచారణ జరిగాయి. కాగా, జగన్‌, విజయసాయిరెడ్డి తదితర నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లకు ఈడీ న్యాయవాదులు కౌంటరు వేయలేదు. ఆయా కేసుల్లో కౌంటర్‌ ఇచ్చేందుకు మరింత సమయాన్ని కోరడంతో నవంబరు 8కి జగతి పబ్లికేషన్స్‌ కేసును, రాంకీ కేసును నవంబరు 5కు కోర్టు వాయిదా వేసింది. 


Updated Date - 2021-10-28T09:38:38+05:30 IST