కలెక్టర్‌పై కేసు పెడతాం

ABN , First Publish Date - 2021-12-07T07:37:32+05:30 IST

తమ గురించి మీడియాలో దుష్ప్రచారం చేసిన మెదక్‌ కలెక్టర్‌పై కేసు పెడతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున హెచ్చరించారు. ఆయన టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం రాత్రి జమున మేడ్చల్‌ మండలంలోని..

కలెక్టర్‌పై కేసు పెడతాం

  • టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని మాట్లాడుతున్నారు
  • రెండు సర్వే నంబర్లలో మాకు 8.30 ఎకరాలుంటే..
  • 70 ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్పడమేంటి..?
  • సర్వే వివరాలు కోర్టుకివ్వాలి.. ప్రెస్‌మీట్‌ సరికాదు
  • నాడు ప్రభుత్వ భూమి కానిది.. నేడు సర్కారుదైందా
  • ఈటల రాజేందర్‌ సతీమణి జమున ఆగ్రహం


మేడ్చల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తమ గురించి మీడియాలో దుష్ప్రచారం చేసిన మెదక్‌ కలెక్టర్‌పై కేసు పెడతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున హెచ్చరించారు. ఆయన టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం రాత్రి జమున మేడ్చల్‌ మండలంలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. మెదక్‌ జిల్లాలోని 81, 130 సర్వే నంబర్లలో తమకు 8.30 ఎకరాల భూమి ఉందని, కానీ ఈ రెండు సర్వే నెంబర్లలో తాము 70 ఎకరాలు ఆక్రమించుకున్నారని కలెక్టర్‌ హరీశ్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టడం సరికాదని, అధికారులు సేకరించిన సమాచారాన్ని కోర్టుకు, తమకు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. కలెక్టర్‌ తమను బద్నాం చేయాలని చూశారని మండిపడ్డారు. తమకు 70 ఎకరాల భూమి లేకున్నా, ఆక్రమించుకున్నట్లు మాట్లాడినందుకు ఆయనపై కేసు పెడతామని హెచ్చరించారు.


నిన్న ఒక కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఈ కలెక్టర్‌కు మంత్రి పదవి ఇస్తానని చెప్పినందుకు తమపై తప్పుగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. మహిళనైన తనను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. తాము రామారావు అనే వ్యక్తి వద్ద రెండు సర్వే నంబర్లలో 8.30 ఎకరాలు కొనుగోలు చేశామని చెప్పారు. నాడు ప్రభుత్వ భూమి కాదని రిజిస్ట్రేషన్‌ చేశారని, ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటున్నారని విమర్శించారు. సర్కారుకు అనుకూలంగా ఉంటే ప్రభుత్వ భూమి ప్రైవేటుగా మారుతుందని, వ్యతిరేకంగా ఉంటే ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమిగా మారుతుందని మండిపడ్డారు. తాము న్యాయంగానే భూములను కొనుగోలు చేశామని చెప్పారు. తాము కొనుగోలు చేసింది 60 ఎకరాలైతే.. కలెక్టర్‌ 70 ఎకరాలు ఆక్రమించుకున్నారని ప్రెస్‌మీట్‌లో చెప్పడాన్ని సవాల్‌ చేస్తామన్నారు. 


దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి..

దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, ఇలా భూములను ఆక్రమించుకున్నామని ఆరోపించడం, ప్రచారం చేయడం సరికాదని జమున అన్నారు. తాము కొనుగోలు చేసిన భూముల్లో గోదాంల నిర్మాణం చేపట్టామని, అందులో కోళ్లను పెంచుతున్నాని, అందుకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను తీసుకున్నామని వివరించారు. రాష్ట్రంలో చాలా మంది మంత్రులు కోళ్ల ఫాంలు పెట్టుకున్నారని, వారికి లేని నాలా అనుమతి తమకు మాత్రమే ఉండాలని వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. నాలా అనుమతి కోసం మూడు నెలల నుంచి తిరుగుతున్నా కలెక్టర్‌ అనుమతి ఇవ్వడం లేదని, మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌తో చెప్పించారని వెల్లడించారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేస్తే, అది ప్రభుత్వ భూమి కావడంతో అనుమతి ఇవ్వలేమని అధికారులు అంటున్నారని తెలిపారు. తమ కోళ్ల ఫాంలు గ్రామానికి 2 కి.మీ దూరంలో ఉంటాయని, వాటి నుంచి దుర్వాసన వస్తోందని తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని తెలిపారు. 

Updated Date - 2021-12-07T07:37:32+05:30 IST