కిషన్‌రెడ్డిని కలిసింది నిజమే
ABN , First Publish Date - 2021-05-27T08:44:30+05:30 IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని తాను కలిసింది నిజమేనని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంగీకరించారు.
- సంజయ్‌ను కూడా కలిశా.. బీజేపీలోకి రమ్మన్నారు
- పార్టీ మారడంపై నిర్ణయం తీసుకోలేదు: ఈటల రాజేందర్
- చేరడం ఖాయమంటున్న బీజేపీ వర్గాలు
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని తాను కలిసింది నిజమేనని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంగీకరించారు. ఒక్క కిషన్‌రెడ్డినే కాదని, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌నీ కలిసినట్లు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ సాధన ఉద్యమంలోనే కాకుండా, ప్రజాప్రతినిధిగా ఉన్న పరిచయాల దృష్ట్యా వివిధ పార్టీలకు చెందిన నేతలను కలిసినట్లుగానే, తాను బీజేపీ నేతలను కూడా కలిశానని ఈటల చెప్పారు. ఆయనను బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రదించినప్పుడు, నేతలను కలుసుకోవటం నిషేధం కాదు కదా అని వ్యాఖ్యానించారు. తాను టీఆర్‌ఎస్ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం వల్ల హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి వచ్చే ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే, మద్దతు ఇవ్వాలని అందరినీ అడుగుతున్నట్లు చెప్పారు. బీజేపీ నేతల వద్ద కూడా ఇదే ప్రతిపాదన పెట్టినట్లు తెలిపారు. అయితే తనను బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం తీవ్రంగా జరిగిందన్నారు. కానీ, పార్టీ మారే విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన ఆలోచనలు నిర్ణయం తీసుకునే వరకు రాలేదని అన్నారు.
ఈటల చేరిక ఖాయమే.. బీజేపీ వర్గాల వెల్లడి
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ పార్టీలో చేరటం దాదాపు ఖాయమైందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పార్టీ జాతీయ నాయకత్వం అపాయింట్‌మెంట్ లభించడమే తరువాయి అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలా? లేక రాజీనామా చేయకుండానే తీసుకుంటారా? అన్నదానిపై పార్టీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాయి. ఈటల చేరిక అంశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా, బీజేపీలో చేరాలని ఈటలపై పలువురు ఉద్యమకారులు ఒత్తిడి తీసుకువచ్చినట్లు కమలం ముఖ్యనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరగాలన్నదే తాము కోరుకుంటున్నామని మరో ముఖ్యనేత ఒకరు తెలిపారు. బుధవారం ఈటల తన నివాసంలో హజూరాబాద్ నియోజకవర్గ నాయకులతో పాటు తన సన్నిహితులతో జరిపిన సమావేశంలోనూ బీజేపీలో చేరిక అంశంపైనే చర్చించినట్లు సమాచారం. బీజేపీలో చేరడమే సరైన నిర్ణయమని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారని తెలిసింది.