110 కోట్లతో నల్లగొండలో ఐటీ హబ్!
ABN , First Publish Date - 2021-12-30T07:05:04+05:30 IST
నల్లగొండలో రూ.110 కోట్లతో ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం

- మునిసిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల రూపురేఖల్ని మార్చేయాలి
- నల్లగొండ జిల్లాలోని మునిసిపాలిటీలకు ప్రత్యేక నిధులు.. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: సీఎం
- రూ.36 కోట్లతో డిగ్రీ కళాశాలకు కొత్త భవనం.. ఎమ్మెల్యే కిశోర్ కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ
నల్లగొండ, డిసెంబరు 29: నల్లగొండలో రూ.110 కోట్లతో ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్ బుధవారం నల్లగొండ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఇతర ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు.
నల్లగొండ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రెండు ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నల్లగొండలోని పానగల్ రిజర్వాయర్‌ను ట్యాంక్‌బండ్‌గా మార్చడంతో పాటు శిల్ప కళాతోరణం ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. పట్టణంలోని రహదారులను వెడల్పు చేయాలని, టౌన్‌హాల్ నూతన భవనాన్ని నిర్మించాలని ఆదేశించారు. నల్లగొండలో డిగ్రీ కళాశాల నూతన భవనానికి రూ.36 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
పట్టణాల రూపురేఖలను మార్చాలి
రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలతో పాటు నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలోని మునిసిపాలిటీలన్నింటికీ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. నల్లగొండ మునిసిపాలిటీలో రోడ్లను అభివృద్ధి చేసి జంక్షన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనాభాకు అనుగుణంగా పట్టణానికి ఇరువైపులా వైకుంఠధామాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
నల్లగొండలో స్థలాన్ని పరిశీలించి వెజ్, నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్కుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయసముద్రం వద్ద ట్యాంక్‌బండ్, పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, పట్టణంలో టౌన్‌హాల్‌ను అభివృద్ధిపర్చాలని సూచించారు. మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. హెలిప్యాడ్ స్థలాలను గుర్తించాలని, గజ్వేల్, సిద్దిపేట తరహాలో పట్టణాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. లో ఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్జీ కళాశాల భవనం కోసం రెండు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు.
15 రోజుల తర్వాత మళ్లీ వస్తా
నందికొండ, హాలియాలో అభివృద్ధి పనులు చేపట్టాలని, ఇతర మునిసిపాలిటీల్లో అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర మంత్రులు నల్లగొండలో పర్యటిస్తారని, అభివృద్ధిపై అధికారులతో చర్చిస్తారని తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలన్నారు. 15 రోజుల్లో మళ్లీ నల్లగొండ వస్తానని చెప్పారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలన్నారు.
వారికి పట్టాలివ్వాలి
ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడి దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇళ్లు, క్వార్టర్లు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా నివాసం ఏర్పర్చుకున్న కాలనీవాసులతో పాటు నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పారు. అక్కడ కూడా అర్హులైన వారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ సీఎ్‌సను ఫోన్‌లో ఆదేశించారు. సాగర్ ప్రాజెక్టు సమీపంలోని కాలనీవాసులకు ఇచ్చిన హామీ మేరకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల కోడ్ తొలగిపోయినందున నిబంధనల మేరకు పట్టాలు మంజూరు చేయాలని చెప్పారు. సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్, రాజ్యసభ సభ్యుడు సంతో్‌షకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కిషోర్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, ఆయన కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి మారయ్య ఇటీవల మృతి చెందగా బుధవారం నిర్వహించిన పెద్దకర్మకు సీఎం హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నల్లగొండ చేరుకున్న కేసీఆర్.. హెలిప్యాడ్ నుంచి నేరుగా ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
