రాజకీయాల్లోకి వస్తారేమోనని సోనూసూద్‌పై ఐటీ, ఈడీ దాడులు

ABN , First Publish Date - 2021-11-09T07:23:45+05:30 IST

‘‘కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడంతోపాటు ఆక్సిజన్‌, మందులు అందించిన సినీ నటుడు సోనూసూద్‌ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఆదర్శంగా నిలిచారు.

రాజకీయాల్లోకి వస్తారేమోనని సోనూసూద్‌పై ఐటీ, ఈడీ దాడులు

  • ఆయన వ్యక్తిత్వంపై బురదజల్లే ప్రయత్నం
  • మేమంతా సోనూసూద్‌ వెంటే: కేటీఆర్‌
  • ఎవరివ్వని మద్దతు తెలంగాణ ఇచ్చింది
  • నా సాయం కొనసాగుతుంది: సోనూ


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడంతోపాటు ఆక్సిజన్‌, మందులు అందించిన సినీ నటుడు సోనూసూద్‌ ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఆదర్శంగా నిలిచారు. సాయం చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నాడని, రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని ఆయనపై కక్షపూరితంగా ఐటీ, ఈడీ దాడులు జరిపించారు. వ్యక్తిత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అయినా, ఆయన భయపడే అవసరం లేదు. మేమంతా సోనూసూద్‌ వెంటే ఉన్నాం’’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇతరులకు సాయం చేసే వారిని నిరోధించేందుకు కొందరు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారని, వాటన్నింటినీ అధిగమించి సాయం చేసే వారికి నిజమైన హీరోలుగా గుర్తింపు వస్తుందని, సోనూసూద్‌ రియల్‌ హీరో అని కితాబునిచ్చారు. తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ ఆధ్వర్యంలో సోమవారం హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వారియర్స్‌ రికగ్నిషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా హాజరైన సోనూసూద్‌తో కలిసి కరోనా వేళ సాయమందించిన వ్యక్తులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులకు అవార్డులు అందించారు. 


ఈ సందర్భంగా మాట్లాడుతూ విపత్తు సమయాల్లో ప్రభుత్వమే అన్నీ చేయలేదని, స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమని చెప్పారు. ఇతరులకు సాయం చేస్తున్న వారిని ఏదో ఆశించి చేస్తున్నారని విమర్శించడం, నిందలు వేయడం, అడ్డుకోవడానికి పలు విధాలుగా ప్రయత్నిస్తారని, సోనూసూద్‌ విషయంలో కూడా ఇదే జరిగిందని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ సమయంలో సాటి మనిషికి సాయం చేసిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నటుడు సోనూసూద్‌ మాట్లాడుతూ, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా మంచి పని చేయకుండా ఆపకూడదని అన్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా చేయని విధంగా తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఒకరోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఉన్న యువకుడిని సాయమందించి కాపాడాలంటూ తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందని, సదరు ఆస్పత్రిని సంప్రదిస్తే అప్పటికే మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ చేసి మాట్లాడినట్లు చెప్పారని వెల్లడించారు. తాను ప్రారంభించిన పని ఇంకా పూర్తి కాలేదని, కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు, డబ్బు లేక చదువు ఆపేసిన చిన్నారులకు తన సాయం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇతరులకు సాయం చేయకుండా దుష్టత్వం నిరోధిస్తుందని, దానిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


50ు కేటాయింపులూ  లేవు!

విభజన చట్టంలో సూచించిన విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని మంత్రి కేటీఆర్‌.. హైదరాబాద్‌లో సోమవారం సీఐఐ, మాన్‌ఈఎక్స్‌ఈ సంయుక్తంగా నిర్వహించిన ‘తెలంగాణ ఇండస్ట్రీ అవార్డ్స్‌ 2021’ కార్యక్రమంలో డిమాండ్‌ చేశారు. కేంద్రం తెలంగాణను చిన్నచూపు చూస్తోందని ధ్వజమెత్తారు. పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో కనీసం 50 శాతం కూడా తెలంగాణకు కేటాయించట్లేదని.. ఆ డబ్బును బిహార్‌, యూపీ, గుజరాత్‌లో ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన సమయంలో తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న ఐఐటీఆర్‌ ఇప్పటి వరకూ లేదని, ఐఐఎం, ఐఐటీ సంస్థల ఏర్పాటుపైనా ఇప్పటికీ కేంద్రం పెదవి విప్పట్లేదన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ను ఢిల్లీ, ముంబై వయా గుజరాత్‌కు కేటాయించి ఇతర రాష్ట్రాల గురించి పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపించినా స్వశక్తితో పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందన్నారు. టీస్‌ఐపాస్‌ విధానంతో ఇప్పటి వరకు రూ.2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణలో రూపొందించిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ‘మేడిన్‌ తెలంగాణ’ పేరుతో ఆన్‌లైన్‌ మాల్‌ను ప్రారంభించారు. 

Updated Date - 2021-11-09T07:23:45+05:30 IST