కేసీఆర్‌ దీక్ష నిజమైనదేనా?

ABN , First Publish Date - 2021-12-28T07:16:41+05:30 IST

సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంలో చేసింది నిజమైన దీక్షే అయితే

కేసీఆర్‌ దీక్ష నిజమైనదేనా?

  • నిజమే అయితే ప్రమాణం చేసి చెప్పాలి 
  • దొంగదీక్ష ఎలా చేస్తారో కేటీఆర్‌ తన తండ్రిని అడగాలి
  • జనవరి నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాలి
  • లేదంటే అసెంబ్లీలో, బయటా అడ్డుకుని తీరతాం
  • మేము దీక్ష చేస్తామనగానే సీఎంకు కొవిడ్‌ గుర్తొచ్చింది
  • పోరాడి సాధించుకున్న తెలంగాణలో స్థానికత ఏదీ?
  • ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి?: బండి సంజయ్‌
  • బంగారు తెలంగాణ కోసం మరో ఉద్యమం: తరుణ్‌చుగ్‌
  • కేసీఆర్‌.. ఓ పిరికి పంద.. నీరో చక్రవర్తి: ఈటల


 హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంలో చేసింది నిజమైన దీక్షే అయితే ప్రమాణం చేసి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ చేశారు. కేసీఆర్‌ నిజమైన తెలంగాణవాది అయితే, రాష్ట్రం కోసం నిజంగానే ఉద్యమిస్తే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఇడ్లీలు తినలేదని, జ్యూస్‌ తాగలేదని, ఢిల్లీలో 48 గంటల దీక్ష పక్కాగా చేశానని గుండెపై చేయి వేసుకుని చెప్పాలన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా తాము చేసిన దీక్షను దొంగదీక్షగా మంత్రి కేటీఆర్‌ అభివర్ణించడంపై సంజయ్‌ మండిపడ్డారు.


‘‘దొంగదీక్ష ఎట్ల చేస్తరో మీ అయ్యనడుగు. మీ అయ్య ఖమ్మంలో దీక్ష చేసినప్పుడు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు నా దగ్గరుంది. బాత్‌రూంలోకి పోయి ఇడ్లీలు తిన్నడు. తెలంగాణ రాకపోయినా, గంగలో పడ్డా నాకు అక్కర్లేదంటూ జ్యూస్‌ గ్లాసు గుంజుకుని తాగాడు. ఢిల్లీలో 48 గంటలు దీక్ష చేస్తనని చెప్పి 10 గంటలు కూడా చేయకుండా మధ్యలోనే వెళ్లిపోయి పడుకున్నాడు’’ అని సంజయ్‌ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు జారీ చేయాలనే డిమాండ్‌తో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆరు గంటలపాటు సంజయ్‌ నిరుద్యోగ దీక్ష చేపట్టారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెల రోజుల్లోగా ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చేదాకా తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని తీరుతారని, అసెంబ్లీ బయట బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారని అన్నారు. ‘‘నిరుద్యోగ యువత ఆవేదనను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. కేంద్రంపై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తే వదలిపెట్టే ప్రసక్తేలేదు. మీ సంగతి తేలుస్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలనూ వదలిపెట్టం’’ అని సంజయ్‌ హెచ్చరించారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అనే మూర్ఖుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ అయిందని, ఆ తల్లిని విముక్తి చేసేందుకు మరో ఉద్యమం అవసరమని అన్నారు. ఉద్యోగాల కోసం ఇదే చివరి ఉద్యమం కావాలని, వారికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 



బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్‌కు వణుకు..

బీజేపీ దీక్ష అంటేనే కేసీఆర్‌కు వణుకు పుడుతోందని సంజయ్‌ అన్నారు. సీఎంకు ఇన్నిరోజులు కొవిడ్‌ గుర్తుకురాలేదని, తాము నిరుద్యోగ దీక్ష చేపడతామని చెప్పగానే గుర్తుకువచ్చి ఆంక్షలు విధించారని మండిపడ్డారు. మేధావులను కూడా మోసం చేసిన మూర్ఖుడు కేసీఆర్‌ అని, ఉద్యమం సందర్భంగా తన మాట కాదని సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌ నిర్వహించినందుకు ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికుల పట్ల అక్కసు పెంచుకున్నారని ఆరోపించారు.


రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. భార్య ఒకచోట.. పిల్లలు మరోచోట.. తల్లిదండ్రులు ఇంకోచోట.. ఇలా ఉద్యోగులను ఎవరిని కదిలించినా ఏడుస్తున్నారని తెలిపారు. సీఎం దగ్గర మటన్‌, చికెన్‌ బిర్యానీలు తింటూ టైంపాస్‌ చేస్తున్న ఉద్యోగ సంఘాలు ఏమయ్యాయని, ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఏ స్థానికత కోసమైతే ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నారో అదే తెలంగాణాలో వారి స్థానికత ప్రశ్నార్థకమైందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రం సాధించుకున్నది ఇందుకోసమేనా? అని ప్రశ్నించారు. డిగ్రీలు, పీజీలు చేసిన అమ్మాయిలు కూలిపని చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


కేసీఆర్‌ నమ్మించి మోసం చేయడం వల్లనే రాష్ట్రంలో అన్నివర్గాలు ఇబ్బంది పడుతున్నాయని ఆరోపించారు. అన్యాయం జరిగినా ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ రాచరిక పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని విస్మరించారని, తన కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేబినెట్‌లో ఉన్నవారిలో ఎంతమంది ఉద్యమంలో పాల్గొన్నారని నిలదీశారు. టీఆర్‌ఎ్‌సకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. 



కేసీఆర్‌ పిరికిపంద.. ఈటల 

సీఎం కేసీఆర్‌ పిరికిపంద అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్య చేశారు. తననెవరూ భయపెట్టలేరని ప్రకటించుకున్న కేసీఆర్‌.. మెడపై కత్తిపెడితే సంతకం చేస్తారా? అని నిలదీశారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒకసారి కుప్పకూలితే తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఉండే అవకాశం కూడా ఉండదన్నారు. ఒకప్పటిలా కేసీఆర్‌ కోసం త్యాగాలు చేసేవాళ్లు ఇప్పుడు లేరని చెప్పారు. కేసీఆర్‌ నీరో చక్రవర్తి అని, ఏడాదిలో 145 రోజులు ఫాంహౌ్‌సలో గడిపిన సీఎం ఆయన తప్ప దేశంలో మరెవరూ లేరని విమర్శించారు. అధికారులు కేసీఆర్‌కు బానిసల్లా ఉండవద్దని సూచించారు.


సీఎం ఫాంహౌ్‌సలో 150 ఎకరాల్లో వరి వేసుకుని రైతులను మాత్రం వరి వేస్తే ఉరేనని ఎలా హెచ్చరిస్తారని ఈటల ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రగతిభవన్‌కు ఇనుప కంచెలు తొలగించాలని, ఫాంహౌస్‌ నుంచి పాలన మానుకోకపోతే బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పారు. కాగా, మంత్రి కేటీఆర్‌ పొరుగు రాష్ట్రానికి వెళ్లి, అక్కడి నుంచి ప్రైవేటు విమానంలో విదేశాలకు వెళతారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఆ విమానానికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కొంతమంది ఐపీఎ్‌సలు తప్ప.. చాలామంది పోలీసు అధికారులు కేసీఆర్‌ను బూతులు తిడుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు వారంతా ప్లేటు ఫిరాయించడం ఖాయమన్నారు. కేసీఆర్‌  తన కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నా.. వారు ఏ ముఖంతో లక్షల జీతాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. 




పోలీసు దిగ్బంధాన్ని ఛేదించుకుని తరలివచ్చిన నిరుద్యోగులు..

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా సంజయ్‌ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు నిరుద్యోగులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తక్షణం ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను పోలీసులు తెల్లవారుజామునుంచే గృహనిర్బంధంలో ఉంచారు. మరికొందరిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.


అయితే పోలీసు దిగ్బంధాన్ని  ఛేదించుకుని పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగులు బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు, ఓయూ, కాకతీయ జేఏసీ నాయకులు, హోంగార్డ్స్‌ అసోసియేషన్‌, విద్యా వలంటీర్లు, ప్రైవేటు ఉద్యోగ సంఘం నా యకులు, సోషల్‌ మీడియా ఫోరం, జేఎన్‌టీయూతో పాటు వివిధ యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ఈ దీక్షకు తరలివచ్చారు. 


Updated Date - 2021-12-28T07:16:41+05:30 IST