ఆన్‌లైన్‌లోకి ఇరిగేషన్‌ ప్రాజెక్టులు

ABN , First Publish Date - 2021-03-14T07:49:01+05:30 IST

ఇరిగేషన్‌ శాఖలో ఇప్పటికే అనేక మార్పులు చేసిన ప్రభుత్వం.. సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా ఆధునికీకరించాలని నిర్ణయించింది.

ఆన్‌లైన్‌లోకి ఇరిగేషన్‌ ప్రాజెక్టులు

  • డ్యాష్‌ బోర్డులోకి రోజువారీ సమాచారం..
  • వరదలు, స్టోరేజీలపై 24 గంటల పర్యవేక్షణ
  • అన్ని ప్రాజెక్టుల సమాచారం అనుసంధానం
  • హైదరాబాద్‌ నుంచి మానిటరింగ్‌  వ్యవస్థ ఏర్పాటు

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్‌ శాఖలో ఇప్పటికే అనేక మార్పులు చేసిన ప్రభుత్వం.. సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిప్టులు, కాల్వలు, ఇతర అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌ చేయనుంది. ప్రాజెక్టులనే కాకుండా ఎప్పటికప్పు డు కురిసే వర్షాలు, వరదలు, నీటి ప్రవాహాలు, లిప్టుల నుంచి ఎత్తిపోసే నీరు, రిజర్వాయర్ల నుంచి విడుదలయ్యే నీరు వంటి వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచి, వాటి ని 24 గంటలపాటు మానిటరింగ్‌ చేసే వ్యవస్థను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇప్పటికే విద్యుత్తు ప్రాజెక్టు ల్లో ఈ పర్యవేక్షణ వ్యవస్థ ఉంది. దాని మాదిరిగానే ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లోనూ అమలు చేయనున్నారు. ఒక ప్రాజెక్టులో ఎంత నీరు ఉంది ? దిగువకు ఎంత వెళుతోంది? లిప్టుల ద్వారా ఏ మేరకు ఎత్తిపోస్తున్నారు వం టి వివరాలు ఆయా ప్రాజెక్టుల అధికారులకే తెలుస్తున్నాయి. ఉదయమో, సాయంత్రమో సంబంధిత ప్రా జెక్టు అధికారులు ఈ వివరాలను డేటా మానిటరింగ్‌ సెల్‌కు పంపిస్తున్నారు. దీంతో ఈ వ్యవస్థలో సమూల మార్పు తీసుకురావాలని నిర్ణయించింది. 


ఓఅండ్‌ఎంలో భాగంగా కొత్త వ్యవస్థ..

ఇరిగేషన్‌ శాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ శాఖను ప్రభుత్వం ఇప్పటికే పునర్వ్యవస్థీకరించింది. ఈ కొత్త వ్యవస్థను కూడా ప్రాజెక్టుల ఓఅండ్‌ఎంలో భాగంగా రూ పొందిస్తున్నారు. ఈ వ్యవస్థను రూపొందించడానికి సాంకేతిక సహాయం కోసం ఒక ప్రైవేట్‌ సంస్థను నియమించారు. దీని రూపకల్పనకు సుమారు రూ. 50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్‌ నుంచే పర్యవేక్షించే వీలుంటుంది. ఉన్నతాధికారులు సంబంధిత ప్రాజెక్టు అధికారులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు, ఆదేశాలను జారీ చేయవచ్చని భావిస్తున్నారు.


కొత్త వ్యవస్థతో అనేక ప్రయోజనాలు ఈఎన్‌సీ నాగేంద్రరావు

ఇరిగేషన్‌ శాఖలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త వ్యవస్థ ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్వహణకు ఇది ఎంతగానో తోడ్పతుంది. వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో వెంటనే ఆయా ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం చేయడంతోపాటు నష్ట నివారణ చర్యలు తీసుకునే వీలుంటుంది. ఏయే రిజర్వాయర్లలో ఎంత మేర నీటి నిల్వ ఉంది? ఎగువ నుంచి ఏ మేర ప్రవాహం వస్తుంది? వంటి సమాచారాన్ని పరిశీలించి, తగు విధంగా ప్రాజెక్టులను నిర్వహించడానికి వీలవుతుంది. ప్రాజెక్టుల రక్షణ విషయంలో కూడా మరింత మెరుగుదల ఉంటుంది.

Updated Date - 2021-03-14T07:49:01+05:30 IST