నేటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు

ABN , First Publish Date - 2021-06-21T08:44:03+05:30 IST

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను సోమవారం నుంచి నడిపేందుకు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

నేటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు

  • ఏపీ నుంచి హైదరాబాద్‌కు రయ్‌.. రయ్‌..
  • తెలంగాణ సరిహద్దులో చెక్‌పోస్టు ఎత్తివేత
  • హైదరాబాద్‌లో రాత్రి 11 దాకా సిటీ బస్సులు..
  • ప్రయాణికులకు మాస్కు తప్పనిసరి


హైదరాబాద్‌ /సిటీ, జూన్‌  20 (ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను సోమవారం నుంచి నడిపేందుకు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని బస్సులను నడపనున్నట్లు టీఎ్‌సఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల్లోగా ప్రయాణికులు చేరుకునేలా సర్వీసులు నడపనుంది. అలాగే, కర్ణాటకలో బెంగళూరు మినహా అన్ని ప్రాంతాలకు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సైతం బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కర్ణాటకలో వారాంతాపు కర్ఫ్యూ అమలులో ఉన్నందున శుక్రవారం నుంచి సోమవారం వరకూ సర్వీసులు నడపబోమని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. 


అలాగే, తెలంగాణకు ఏపీ నుంచి బస్సులు నడపనున్నట్లు అక్కడి ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో పగటిపూట మాత్రమే బస్సులు నడుపుతామని ఏపీఎ్‌సఆర్టీసీ ఆపరేషన్స్‌ విభాగం ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. కాగా, హైదరాబాద్‌ నగరంలో ప్రయాణికుల రద్దీగా అనుగుణంగా అన్ని రూట్లలో బస్సులు నడుపుతామని గ్రేటర్‌ ఆర్టీడీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సర్వీసులు నడిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉన్న రూట్లలో అదనపు ట్రిప్పులు నడుపుతామని చెప్పారు. బస్సుల్లో ఎక్కే ప్రయాణికులు తప్పని సరిగా మాస్క్‌లు ధరించి, కండక్టర్లకు సహకరించాలని సూచించారు.  లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా సడలించడంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును పోలీసులు శనివారం అర్ధరాత్రి తీసివేయడంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-06-21T08:44:03+05:30 IST