ఆర్టీసీలో పదవీ విరమణల జోరు

ABN , First Publish Date - 2021-12-31T08:50:03+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎ్‌సఆర్టీసీ)లో వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్‌ కానున్నారు. శుక్రవారం(31న) ఒక్కరోజే 150 మంది పదవీవిరమణ పొందుతున్నారు.

ఆర్టీసీలో పదవీ విరమణల జోరు

నేడు 150 మంది.. ఏడాదిలో ఏడు వేల మందికి పైగానే రిటైర్మెంట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎ్‌సఆర్టీసీ)లో వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్‌ కానున్నారు. శుక్రవారం(31న) ఒక్కరోజే 150 మంది పదవీవిరమణ పొందుతున్నారు. 2022 డిసెంబరు నాటికి రిటైరయ్యేవారి సంఖ్య7,040కి పైనే ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది గుర్తించిన సర్కారు ఆర్టీసీ సిబ్బంది విషయంలో పదవీ విరమణ వయసును 60 ఏళ్లకే పరిమితం చేసింది. 55 రోజుల సుదీర్ఘకాలం సమ్మె అనంతరం 2019లో ఆర్టీ సీ కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచిం ది. ఆ సమయంలోనే కొందరు డ్రైవర్లు ఆరోగ్యం సహకరించడం లేదంటూ ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. అలాగే కంటి చూపు మందగించిన కండక్టర్లతో పా టు మెకానికల్‌ విబాగంలో పని చేసే సీనియర్లు మరి కొందరు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించాలని దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సంబంధించి ప్రభు త్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు. పదవీ విరమణ పెంపు ప్రకటన చేసి న 2019 నాటికే 4,200కు పైగా మిగులు ఉద్యోగులున్నట్టు నిర్ధారించారు. అప్పటికే ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ.. ఆస్తులను కుదువబెట్టి బ్యాంక్‌ రుణా లు తీసుకొచ్చి ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లిస్తోంది. ఏడాది కాలంలో వేలసంఖ్యలో ఉద్యోగులు రిటైర్‌ కానున్న నేపథ్యంలో ఇక జీతభత్యాలు భారం తగ్గిపోయే అవకా శం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ కొత్తగా బస్సులు కొనుగోలు చేయకుండా అద్దె బస్సులపైనే ఆధారపడుతుండటంతో నూతన నియామకాలూ లేనట్టేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై భారం పెరగొచ్చని అంటున్నారు. 


సగౌరవంగా వీడ్కోలు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ 

పదవీ విరమణ రోజున ఉద్యోగుల కుటుంబసభ్యులను ఆహ్వానించి వారి సమక్షంలో ఘనంగా వీడ్కోలు పలుకుతామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిటైరయ్యే రోజు ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులను ఆర్టీసీ వాహనంలో ఇంటి వద్దకు చేర్చి.. సగౌరవంగా  వీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాలువాలు కప్పి.. ఆర్టీసీ అభివృద్ధికి అందించిన సేవలను గుర్తు చేస్తూ జ్ఞాపికలను బహూకరించాలని సూచించారు. 

Updated Date - 2021-12-31T08:50:03+05:30 IST