విద్యుత్‌ కనెక్షన్లపై ఆరా !

ABN , First Publish Date - 2021-05-20T07:34:14+05:30 IST

మేడ్చల్‌ జిల్లా దేవరయాంజల్‌లోని వివాదాస్పద భూములపై ప్రభుత్వ విచారణ కొనసాగుతోంది.

విద్యుత్‌ కనెక్షన్లపై ఆరా !

  • ఈటల ఆర్థికమూలాలపై ప్రభుత్వ టార్గెట్‌.. 
  • దేవరయాంజల్‌లోని భూములపై విచారణ
  • ఫాంహౌజ్‌ కనెక్షన్లపైనా వివరాల సేకరణ 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లా దేవరయాంజల్‌లోని వివాదాస్పద భూములపై ప్రభుత్వ విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వివాదాస్పద భూములపై తేల్చాలని ఐఏఎ్‌సల కమిటీని నియమించి విచారణ చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా విద్యుత్‌ కనెక్షన్లపై విచారణకు దిగింది. దీంతో జిల్లా యంతాంగ్రం దేవరయాంజల్‌లోని వివాదాస్పద భూముల్లో నిర్మించిన గోదాములు, ఫాంహౌజ్‌లు, సంస్థలు, ఇళ్లకు సంబంఽధించిన విద్యుత్‌ కనెక్షన్లపై సర్వే నిర్వహించింది. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు, జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు విద్యుత్‌ కనెక్షన్ల మంజూరుపై వివరాలు సేకరించారు. ఈ ప్రాంతంలో దాదాపు 200వరకు గోదాములు, 30వరకు ఫాంహౌజ్‌లు, పలు సంస్థలకు చెందిన 10 కార్యాలయాలున్నాయి.  గోదాములు ఫాంహౌజ్‌లు, ఇతర కార్యాలయాలు ఏ సంవత్సరంలో నిర్మించారు? భవన నిర్మాణాలకు అనుమతి ఎప్పుడు  తీసుకున్నారు? ఎంత మేరకు సర్వీసు కనెక్షన్లు ఉన్నాయి? నెలవారీగా ఎంత మేరకు బిల్లులు చెల్లిస్తున్నారు? బిల్లులు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా? వంటి సమగ్ర సమాచారం కోసం ప్లాట్ల నెంబర్ల వారీగా యజమానులను విచారించినట్లుగా తెలిసింది. ఈ మేరకు స్థానిక అధికారులు జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. 

Updated Date - 2021-05-20T07:34:14+05:30 IST