ఆయిల్‌పామ్‌ రవాణా ఛార్జీలు పెంచండి

ABN , First Publish Date - 2021-08-21T08:09:34+05:30 IST

ఆయిల్‌పామ్‌ క్షేత్రాల నుంచి ఫ్యాక్టరీలకు తరలించే గెలల రవాణా ఛార్జీలను పెంచాలని రైతుల నుంచి తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ప్రతిపాదనలు వచ్చాయి.

ఆయిల్‌పామ్‌ రవాణా ఛార్జీలు పెంచండి

తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు రైతుల విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ క్షేత్రాల నుంచి ఫ్యాక్టరీలకు తరలించే గెలల రవాణా ఛార్జీలను పెంచాలని రైతుల నుంచి తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ప్రతిపాదనలు వచ్చాయి. సాగు వ్యయం, డీజిల్‌ ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రవాణా ఛార్జీలకు అదనంగా 50 శాతం పెంచాలని రైతుల నుంచి ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మూడు స్లాబుల్లో రైతులకు రవాణా ఛార్జీలు చెల్లిస్తున్నారు. మొదటి స్లాబులో 0-15 కి.మీ దూరానికి టన్నుకు రూ.285, రెండో స్లాబులో 16-50 కి.మీ వరకు రూ.415, మూడో స్లాబులో 51 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉంటే రూ.645 చెల్లిస్తున్నారు. 100 కి.మీకు మించి దూరం ఉంటే.. సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేసి ఆయిల్‌పామ్‌ గెలలను సేకరిస్తున్నారు. ఈ ఛార్జీలు తమకు గిట్టుబాటు కావడంలేదని, స్లాబులను సవరించాలని రైతుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.

Updated Date - 2021-08-21T08:09:34+05:30 IST