సల్లంగ సూడు.. మల్లన్న..
ABN , First Publish Date - 2021-01-16T04:24:08+05:30 IST
సల్లంగ సూడు.. మల్లన్న..
జనసంద్రంగా మారిన ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం
మహానివేదనతో మార్నేనియుల దేవుడి రథం ఊరేగింపు
ఐనవోలు, జనవరి 15: మల్లికార్జునస్వామి మహాజాతర భక్తులతో కిటకిటలాడింది. ఐలోని మల్లన్న.. అంటూ స్వామివారిని కీర్తిస్తూ పరవశించిపోయారు. పూసల లాగులు.. గజ్జెల మోత.. డోలు శబ్దాలు.. చేతుల్లో వీరకొలు.. త్రిశూలాలు.. ఖడ్గాలు.. నుదుటిపై బండారి పసుపు.. నెత్తిపై బోనాలతో వేలాదిగా భక్తులు మల్లన్న సన్నిధికి తరలివచ్చారు. వెలుగుతున్న దీపాల మధ్య గుం పులు గుంపులుగా జానపద గేయాలతో నృత్యాలు చేస్తూ భీతికొల్పుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తన్మయం చెందారు. ఒగ్గు పూజారుల అందమైన పట్నాలు.. ఢమరుక శబ్ధాల నడుమ సల్లంగా సూడు తండ్రి అంటూ స్వామి వారిని వేడుకున్నారు. గురువారం సంక్రాంతి పర్వదినం రోజున రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకులు స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, బిల్వార్చన మహానివేదన నీరాజన పుణ్యాహవాచనం పూజలు జరిపారు. మల్లికార్జునస్వామికి వెండికిరీటం, కవచం సుగంధాలు వెదజల్లే పుష్పమాలతో దేదిప్యమానంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి తెల్లవారు వరకు అభిషేకాలు, దర్శనాలు జరిగాయి.
మహానివేదనతో దేవుడి రథం
మార్నేని వంశీయుల ఆధ్వర్యంలో అనాదిగా వస్తున్న మహానివేదన దేవుడి రథాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు స్వగృహంలో సుందరంగా తీర్చిదిద్దారు. మహానివేదనతో బయలుదేరే ముందు ఎమ్మెల్యే అరూరి రమేష్ పూజల్లో పాల్గొన్నారు. రథం గ్రామ పురవీధుల గుండా ఆలయానికి చేరుకొని మూడుసార్లు ప్రదక్షణ జరిగింది. మంగళహారతులతో రథానికి మహిళలు స్వాగతం పలికారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రభ బండ్లు రథాన్ని అనుసరించాయి. ఈవో నాగేశ్వర్‌రావు, ధర్మకర్తలు రథానికి ముందు కొబ్బరి కాయలు కొట్టి మార్నేని కుటుంబసబ్యులను సన్మానించారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
సంక్రాంతి రోజున రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని దంపతులు, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ దంపతులు, బీజేపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
కొవిడ్ ఎఫెక్ట్‌తో తగ్గిన భక్తుల సంఖ్య
కొవిడ్ కారణంగా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు త్వరితగతిన మొక్కులు చెల్లించుకొని వెళ్లిపోయారు. ఉగాది వరకు జరిగే ప్రతి ఆది, బుధ వారం వారాంతపు జాతరలకు సుదూర ప్రాంతాల భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని దేవాదాయ అఽధికారులు భావిస్తున్నారు. జాతరలో పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.






