సెంచరీకి చేరువలో..

ABN , First Publish Date - 2021-05-30T09:02:00+05:30 IST

రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాయి. బ్యాట్స్‌మన్‌ మంచి జోరుమీదున్న క్రికెట్‌ మ్యాచ్‌లో టీమిండియా స్కోరుబోర్డులో అంకెలు వేగంగా మారిపోయినట్లుగా.

సెంచరీకి చేరువలో..

  • ఐదు జిల్లాల్లో పెట్రోలు ధర రూ.99 పైనే
  • ఆదిలాబాద్‌లో లీటరు రూ.99.65
  • రూ.100కు 35 పైసలే తక్కువ!
  • ఈ నెలలో 15 సార్లు పెరిగిన ధరలు
  • డీజిల్‌ కూడా సెంచరీ బాటలోనే..
  • ఆదిలాబాద్‌లో లీటరు రూ.94.40
  • హైదరాబాద్‌లో రూ.92.52 పైసలు
  • వాహనదారులపై పెను భారం
  • నిత్యావసరాలు సహా ధరలన్నీ పైపైకి..
  • ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది
  • ఆర్థిక రంగ నిపుణుల ఆందోళన


హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాయి. బ్యాట్స్‌మన్‌ మంచి జోరుమీదున్న క్రికెట్‌ మ్యాచ్‌లో టీమిండియా స్కోరుబోర్డులో అంకెలు వేగంగా మారిపోయినట్లుగా.. రోజురోజుకూ పెట్రోలు బంకుల్లో ధరల సూచికలూ మారిపోతున్నాయి. పెట్రోలు ధర రూ.100కు కొన్ని పైసల దూరంలో ఉండగా.. డీజిల్‌ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈ నెలలోనే ఏకంగా 15 సార్లు ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ పోతుండగా.. వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల కిందటే ప్రీమియం పెట్రోలు రూ.100 దాటగా, సాధారణ పెట్రోలు వందకు కేవలం 35 పైసల దూరంలో ఉంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో లీటరు పెట్రోలు ధర రూ.99.65 పైసలకు చేరగా.. డీజిల్‌ రూ.94.40 పైసలకు చేరడం గమనార్హం. మరో 4 జిల్లాల్లో కూడా పెట్రోలు ధరలు రూ.99 పైనే ఉన్నాయి. డీజిల్‌ ధర కూడా పెట్రోలుతో పాటే ఎగబాకుతోంది.


అమెరికా డాలరుతో రూపాయి మారక విలువ, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ సూచీలు, ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్నట్లు చమురు సంస్థలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గకపోవడం శోచనీయం. ఎక్సైజ్‌ డ్యూటీ, ట్యాక్స్‌, డీలర్‌ కమీషన్‌, రాష్ట్రాలవారీగా వేర్వేరు పన్నులు తోడైన తర్వాత పెట్రోలు, డీజిల్‌ రిటైల్‌ ధర దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో, వినియోగం తగ్గిన సమయంలో బ్యారెల్‌ ధర తగ్గినప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించుకోకపోవడంతో బ్యారెల్‌ ధర తగ్గిన ప్రతిఫలం వినియోగదారులకు దక్కడంలేదు. దీంతో వరుసగా ధరలు పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. 

 

ఐదు జిల్లాల్లో అత్యధికం

హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.97.62 ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.99.65కి చేరింది. మరో 35 పైసలు పెరిగితే సెంచరీ కొట్టినట్లే. నిజామాబాద్‌లో రూ.99.50, వనపర్తిలో రూ.99.29, కామారెడ్డిలో రూ.99.28, గద్వాల జిల్లాలో రూ.99.26కి చేరింది. హైదరాబాద్‌లో  డీజిల్‌ ధర రూ.92.52 ఉంటే.. ఆదిలాబాద్‌లో అత్యధికంగా రూ.94.40కి చేరింది. కొత్తగూడెం, జగిత్యాల, గద్వాల, కామారెడ్డి,  ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నారాయణపేట్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి జిల్లాల్లో డీజిల్‌ ధర రూ.93-94 మధ్య ఉంది. శనివారం పెట్రోలుపై 26 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగాయి. 


అన్ని ధరలూ పైపైకి.. 

పెరుగుతున్న పెట్రో ధరలు అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతున్నాయి. రవాణా వ్యయం పెరిగిపోవడంతో నిత్యావసరాలు, కూరగాయలు, పప్పులు.. ఇలా అన్నింటి ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. అసలే లాక్‌డౌన్‌.. ఆపై ధరల మోతతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రో ధరలు పెరగడంతో అన్ని వర్గాల వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు ఉన్నంత కాలం పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగవు. ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ రోజూ పెరుగుతూనే ఉంటాయి. అంటే మార్కెట్‌, చమురు కంపెనీలు కాకుండా కేంద్రమే పెట్రో ధరలను శాసిస్తున్నట్లు స్పష్టమవుతోంది. బ్యారెల్‌ ధర పడిపోయినప్పటికీ పెట్రోలు ధరలు తగ్గకపోవడానికి ప్రభుత్వ చేతివాటమే కారణమని నిపుణులు చెబుతున్నారు.


వినియోగదారులకు, డీలర్లకు ఇద్దరికీ భారమే

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే పెట్రోలియం డీలర్లకు పెట్టుబడి పెరుగుతుంది. ప్రతి పెట్రోల్‌ పంపులో కనీసం మూడు రోజుల స్టాక్‌ ఉంచాలి. ట్యాంకర్ల రవాణా, ఇతర ఖర్చులతో డీలర్లపై ఆర్థిక భారం పడుతుంది. వినియోగదారులపైనా ఎక్కువ భారం పడుతుంది. ప్రజా రవాణా భారం పెరుగుతుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే అన్నిరంగాలపై పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తుంది.  

- అమరేందర్‌రెడ్డి, తెలంగాణ పెట్రోల్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు

Updated Date - 2021-05-30T09:02:00+05:30 IST