‘ధరణి’లో భూమి ఒకరిది.. పాస్‌ బుక్‌ మరొకరికి

ABN , First Publish Date - 2021-11-26T09:57:34+05:30 IST

తమ భూమికి మరొకరి పేరున పాస్‌ పుస్తకం జారీ చేయడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

‘ధరణి’లో భూమి ఒకరిది.. పాస్‌ బుక్‌ మరొకరికి

  • బాధిత రైతు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
  • నాలుగు నెలల క్రితం ఇదే సమస్యతో తల్లి మృతి

కేసముద్రం, నవంబరు 25: తమ భూమికి మరొకరి పేరున పాస్‌ పుస్తకం జారీ చేయడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని సరిచేయాలని అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగినా ఫలితం లేకపోవడంతో మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన మేడిద వెంకన్న క్రిమిసంహారక మందు తాగాడు. బాధిత కుటుంబ సభ్యులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. వెంకన్న తండ్రి అంతయ్య పేరిట ఇనుగుర్తిలో 3.39 ఎకరాల భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం ఉంది. 2017లో జారీ చేసిన పట్టా పాస్‌ పుస్తకంలో 2.17 ఎకరాలే నమోదైంది. మిగిలిన 1.22 ఎకరాల భూమికి మరొకరి పేరిట పాస్‌ పుస్తకం జారీ అయింది. 3.39 ఎకరాలకు తన పేరిట పట్టా పాస్‌ పుస్తకాన్ని జారీ చేయాలంటూ వెంకన్న తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూతిరుగుతున్నాడు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. ఇదే సమస్యతో మనస్థాపం చెందిన వెంకన్న తల్లి ప్రమీ ల 4 నెలల క్రితం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికైనా తమకు పూర్తి విస్తీర్ణానికి పాస్‌ పుస్తకం జారీ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

Updated Date - 2021-11-26T09:57:34+05:30 IST