వేమూరి కనకదుర్గ అస్థికల నిమజ్జనం

ABN , First Publish Date - 2021-05-02T07:17:58+05:30 IST

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ అస్థికలను ఆమె తనయుడు ఆదిత్య శనివారం ఉదయం కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.

వేమూరి కనకదుర్గ అస్థికల నిమజ్జనం

  • బీచుపల్లి వద్ద కృష్ణానదిలో కలిపిన కుమారుడు ఆదిత్య
  • ఆర్కేను పరామర్శించిన మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌, జగదీశ్వర్‌ 
  • కనకదుర్గ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర అర్చక సమాఖ్య


గద్వాల, బంజారాహిల్స్‌, బర్కత్‌పుర, మే 1 (ఆంధ్రజ్యోతి): ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ అస్థికలను ఆమె తనయుడు ఆదిత్య శనివారం ఉదయం కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద అస్థికలను ఆయన నదిలో కలిపారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చిన అస్థికలకు నది సమీపంలో వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురణకర్త శేషగిరిరావు పాల్గొన్నారు. కాగా రాధాకృష్ణను శనివారం పలువురు రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార, సినీ ప్రముఖులు పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆర్కేను పరామర్శించిన వారిలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, గాదరి కిషోర్‌, పిడమర్తి లింగయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌,  కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, రాష్ట్ర సమాచార కమిషనర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి,  రాష్ట్ర బీజేపీ ఉపాఽధ్యక్షురాలు డీకే అరుణ, ఈనాడు ఎడిటర్‌ ఎం. నాగేశ్వరరావు, ఏపీ బీజేపీ నాయకుడు కిలారి దిలీస్రెడ్డి,  ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఉన్నారు. కాగా వేమూరి కనకదుర్గ మృతి పట్ల తెలంగాణ అర్చక సమాఖ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ‘ఆంధ్రజ్యోతి’ అభివృద్ధి, మహిళా సాధికారతకు కనకదుర్గ విశేష కృషి చేశారని సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-02T07:17:58+05:30 IST