పోషకాలు కలిపిన ఉప్పుడు బియ్యం.. నెలకు 5 లక్షల టన్నులిచ్చినా తీసుకుంటాం

ABN , First Publish Date - 2021-10-19T08:30:16+05:30 IST

ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌)ను నేరుగా ఇస్తే తిరస్కరిస్తున్న ఎఫ్‌సీఐ.. అదే బియ్యానికి సూక్ష్మ పోషకాలు (ఫోర్టిఫైడ్‌) కలిపి ఇస్తే ఎంతైనా తీసుకుంటామని స్పష్టంచేసింది.

పోషకాలు కలిపిన ఉప్పుడు బియ్యం.. నెలకు 5 లక్షల టన్నులిచ్చినా తీసుకుంటాం

  • తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వాటికి డిమాండ్‌
  • పౌర సరఫరాల, మిల్లర్ల సమావేశంలో ఎఫ్‌సీఐ


హైదరాబాద్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌)ను నేరుగా ఇస్తే తిరస్కరిస్తున్న ఎఫ్‌సీఐ.. అదే బియ్యానికి సూక్ష్మ పోషకాలు (ఫోర్టిఫైడ్‌) కలిపి ఇస్తే ఎంతైనా తీసుకుంటామని స్పష్టంచేసింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వీటికి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో సూక్ష్మ పోషకాల (ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ -ఎఫ్‌ఆర్‌కే)తో మిశ్రమం చేసిన ఉప్పుడు బియ్యాన్ని నెలకు 5 లక్షల టన్నులిచ్చినా స్వీకరిస్తామని ఎఫ్‌సీఐ తెలంగాణ జీఎం దీపక్‌శర్మ వెల్లడించారు. గత యాసంగి ఉప్పుడు బియ్యం తీసుకునే అంశంపై చర్చించారు. కాగా, తొలుత 24.75 లక్షల టన్నుల బియ్యమే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో మరో 20 లక్షల టన్నుల సేకరణకు అంగీకరించింది. ఈ లెక్కన 44.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటిదాక 22.76 లక్షల టన్నుల బియ్యాన్ని ఇచ్చారు. ఎఫ్‌సీఐకి గోదాముల కొరత ఉండడం, ఉప్పుడు బియ్యం వినియోగం తగ్గిపోవడంతో తెలంగాణ నుంచి కదలిక (మూవ్‌మెంట్‌) తక్కువగా ఉందని సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో సమస్యకు ఎఫ్‌సీఐ అధికారులు ప్రత్యామ్నాయం సూచించారు. ప్రజా పంపిణీ (, మధ్యాహ్న భోజన అవసరాలకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎఫ్‌ఆర్‌కే బియ్యానికి డిమాండ్‌ ఉందని.. అలాంటి బియ్యాన్ని ఇస్తే సత్వరమే కదలిక వస్తుందని దీపక్‌శర్మ సూచించారు.  వచ్చే యాసంగి సీజన్‌లో ఉప్పుడు బియ్యం ఇస్తే తీసుకునేది లేదని, ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామని ఎఫ్‌సీఐ అధికారులు మరోసారి తేల్చిచెప్పారు. కాగా, కొందరు మిల్లర్లే ఎఫ్‌ఆర్‌కే బియ్యం సరఫరాకు అంగీకరించారు.


Updated Date - 2021-10-19T08:30:16+05:30 IST