వరి విత్తనాలు అమ్మొద్దు!
ABN , First Publish Date - 2021-10-06T08:34:22+05:30 IST
వచ్చే యాసంగిలో వరిసాగు వల్ల రైతులకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నందున వరిసాగు విత్తనాలు విక్రయించరాదని, వరిసాగు చేయని రైతులు వేసుకోదగిన పంటలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని విత్తన ఉత్పత్తి కంపెనీలకు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు కోరారు.
- యాసంగిలో వరిసాగుతో రైతులకు నష్టం
- వేసుకోదగిన ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉంచండి
- విత్తన కంపెనీలను కోరిన వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): వచ్చే యాసంగిలో వరిసాగు వల్ల రైతులకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నందున వరిసాగు విత్తనాలు విక్రయించరాదని, వరిసాగు చేయని రైతులు వేసుకోదగిన పంటలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని విత్తన ఉత్పత్తి కంపెనీలకు రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో పలు విత్తనోత్పత్తి కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ అవసరాల మేరకు సాగు చేపట్టి రైతులు అధిక లాభాలు ఆర్జించేందుకు విత్తన కంపెనీలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
వరిసాగు విత్తనాలకు బదులుగా వేరుశనగ, శన, పెసర, ఆముదం, పొద్దు తిరుగుడు, నువ్వులు, ధనియాలు తదితర పంటలను ప్రోత్సహించేందుకు అవసరమైన మేరకు విత్తనాలను రైతుల కోసం అందుబాటులో ఉంచాలని కోరారు. వరికి బదులుగా వేసుకోవలసిన విత్తనాల వివరాలను విత్తన కంపెనీ ప్రతినిధులకు ఆయన వివరించారు. కాగా నిరుడు యాసంగి సీజన్ లెక్కప్రకారం చూస్తే సుమారు 50 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతులు సంసిద్ధమయ్యారు. ఎకరానికి 25 కిలోల చొప్పున చూస్తే... 12.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయి. సాధారణంగా సీజన్‌కు ముందే ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్, ట్రూత్‌ఫుల్ లేబుల్ విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు కంపెనీలు సిద్ధంగా ఉంటాయి. యాసంగి సాగు సీజన్ ప్రారంభానికి సమయం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా వరి విత్తనాల ఉత్పత్తి, సేల్స్ కు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.