గంజాయిపై ముప్పేట దాడి

ABN , First Publish Date - 2021-10-29T08:09:26+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో గంజాయి స్మగ్లర్లు, విక్రేతలపై పోలీసులు ముప్పేట దాడి చేస్తున్నారు. ఏపీలోని విశాఖ ఏజెన్సీ సీలేరు నుంచి తెలంగాణ రాజధానికి ఆటోరిక్షాలో రవాణా చేసిన 70 కిలోల గంజాయిని హైదరాబాద్‌ పోలీసులు

గంజాయిపై ముప్పేట దాడి

  • హైదరాబాద్‌లో 70 కిలోల పట్టివేత..
  • సీలేరు నుంచి ఆటోరిక్షాలో తరలింపు.. ఇద్దరు పాతనేరస్థులకు బేడీలు
  • సైబరాబాద్‌లో 10 కేసులు.. 17 మంది పట్టివేత
  • నల్లగొండ జిల్లాలో 42కిలోల గంజాయి స్వాధీనం
  • గంజాయి ఆపరేషన్‌పై అసత్య ప్రచారం తగదు
  • విజయసాయిరెడ్డికి ఎస్పీ రంగనాథ్‌ హితవు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 28 (ఆంధ్ర‌జ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో గంజాయి స్మగ్లర్లు, విక్రేతలపై పోలీసులు ముప్పేట దాడి చేస్తున్నారు. ఏపీలోని విశాఖ ఏజెన్సీ సీలేరు నుంచి తెలంగాణ రాజధానికి ఆటోరిక్షాలో రవాణా చేసిన 70 కిలోల గంజాయిని హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి, గుడంబా స్మగ్లింగ్‌ కేసులతో సంబంధమున్న ఇద్దరు పాత నేరస్థులను అరెస్టు చేశారు. పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌  గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రహ్మత్‌నగర్‌లో భారీగా గంజాయి డంప్‌ ఉందని ఉప్పందుకున్న ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. రేణుకానగర్‌కు చెందిన నర్సింగ్‌సింగ్‌, బాపూనగర్‌కు చెందిన రమావత్‌ రమేశ్‌ను అరెస్టు చేశారు. వీరిద్దరూ గతంలో గుడంబా సరఫరా చేసేవారని.. క్రమంగా గంజాయి విక్రయాలను ప్రారంభించారని అంజనీకుమార్‌ వివరించారు. రమేశ్‌ ద్వారా నర్సింగ్‌ విశాఖలోని సీలేరు నుంచి గంజాయిని ఆటోరిక్షాలో తెప్పించేవాడని, అలా ఒక్కో ట్రిప్పునకు రమేశ్‌కు రూ. 10వేలు ఇచ్చేవాడని వివరించారు.


సీలేరులో కిలో గంజాయిని రూ. 2 వేలకు కొనుగోలు చేసి.. నగరంలో 10 గ్రాముల ప్యాకెట్లుగా విక్రయిస్తారని, ఒక్కో ప్యాకెట్‌కు రూ. 150 వసూలు చేస్తారని తెలిపారు. రమేశ్‌ ఇటీవల సీలేరు నుంచి 70 కిలోల గంజాయిని 35 బండిళ్లలో ప్యాక్‌చేసి, ఆటోలో తీసుకువచ్చాడన్నారు. పోలీసుల దాడుల నేపథ్యంలో దాన్ని రహ్మత్‌నగర్‌లో దాచారని చెప్పారు. సీలేరులో వీరికి గంజాయి విక్రయించే ప్రధాన నిందితుడు రవి కోసం గాలిస్తున్నామన్నారు. కాగా.. గడిచిన పది రోజుల్లో హైదరాబాద్‌ పోలీసులు 289 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. 32 కేసులు నమోదు చేసి, 60 మందిని అరెస్టు చేశారు. అటు సైబరాబాద్‌ పోలీసులు కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్‌ ఎన్‌డీపీఎస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో గురువారం మొత్తం 10 కేసులు నమోదు చేసి, 17 మందిని అరెస్టు చేశారు. 


అసత్య ప్రచారం వద్దు: ఎస్పీ రంగనాథ్‌

నల్లగొండ: ఆంధ్రా-ఒడిసా సరిహద్దులో తాము చేపట్టిన గంజాయ్‌ ఆపరేషన్‌పై అసత్య ప్రచారం తగదని ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డికి నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ హితవు పలికారు. గురువారం ఆయన  మాట్లాడుతూ.. పోలీసు విధులను రాజకీయాలతో ముడిపెట్టవద్దని కోరారు. తెలంగాణ సీఎం ఆదేశాలతో గంజాయి విక్రయాలపై స్పెషల్‌డ్రైవ్‌లు చేపడుతున్నామన్నారు. ఏవోబీ నుంచి రవాణా అవుతున్న గంజాయిపై నల్లగొండ జిల్లాల్లో జరిపిన తనిఖీల సందర్భంగా 35 కేసులు నమోదు చేశామని గుర్తుచేశారు. వీటి దర్యాప్తులో భాగంగా.. 17 బృందాలతో ‘ఆపరేషన్‌ గాంజా’ చేపట్టామన్నారు. ఏవోబీలో ఆపరేషన్‌పై విశాఖ రూరల్‌ జిల్లా ఎస్పీ కృష్ణారావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబుతో మాట్లాడామని వివరించారు. నల్లగొండ బృందాలు రెండు రోజులపాటు వైజాగ్‌ రూరల్‌ జిల్లాలోని పోలీసు గెస్ట్‌హౌ్‌సలోనే ఉన్నాయన్నారు. ఏపీ పోలీసుల సహకారంతోనే ఈ ఆపరేషన్‌ను చేపట్టామన్నారు. ‘‘నల్లగొండ జిల్లా పోలీసులు ప్రాణాలకు తెగించి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ నెల 17న చింతపల్లి పీఎస్‌ పరిధిలోని లంబసింగిలో గంజాయి ముఠాల దాడి నుంచి తప్పించుకునేందుకు ఆత్మరక్షణకు కాల్పులు జరిపాం. వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం’’ అని వెల్లడించారు. ఏపీలోని రాజకీయ పార్టీలు వాటి స్వార్థం కోసం పోలీసులను, తనను లాగడం సరికాదన్నారు. తమపరిధిలోని కేసుల్లో గంజాయి స్మగ్లర్లు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామన్నారు.


జిల్లాల్లో ఇలా..

  • నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు.. చిట్యాలలో గురువారం నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు రూ. 2.62 లక్షల విలువైన 42 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు.
  • సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముగ్గురిని అరెస్టు చేసి 110 గ్రాములు, నర్సాపూర్‌లో ఓ వ్యక్తిని అరెస్టు చేసి 340 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
  • రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండాలో ఓ యువకుడిని అరెస్టు చేసి 250 గ్రాముల గంజాయిని సీజ్‌ చేశారు.
  • నిజామాబాద్‌లోని అర్సపల్లిలో  షేక్‌ నజీర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి, 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
  • ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం రంఖం గ్రామానికి చెందిన బాపూజీ, జితేందర్‌, భరత్‌ అనే గిరిజనుల ఇళ్ల పెరట్లో సాగు చేస్తున్న 30 గం జాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు.

Updated Date - 2021-10-29T08:09:26+05:30 IST