హైదరాబాద్‌ ఇక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం

ABN , First Publish Date - 2021-12-19T07:16:59+05:30 IST

‘‘హైదరాబాద్‌ ఐఏఎంసీ ఏర్పాటుతో ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ విషయంలో మన దేశం అంతర్జాతీయ కేంద్రంగా మారుతుంది.

హైదరాబాద్‌ ఇక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం

  • నాలుగు నెలల్లోనే అత్యాధునిక, అంతర్జాతీయ సౌకర్యాలు
  • సింగపూర్‌ సెంటర్‌ కంటే గొప్పగా ఉందంటున్నారు
  • ఇక కేసులు విదేశీ సెంటర్లకు వెళ్లడం తగ్గుతుంది
  • ఇక్కడికి జాతీయ, అంతర్జాతీయ వినియోగదారులు వస్తారు
  • ప్రారంభానికి ముందే లలిత్‌ మోదీ కేసు సిఫారసు చేశాం
  • కుటుంబ వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీకి వెళ్లాలని చెప్పాం
  • గ్లోబల్‌ సిటీగా అర్హతలూ ఉండడం వల్లే హైదరాబాద్‌కు ఐఏఎంసీ
  • ఐఏఎంసీ హైదరాబాద్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీజేఐ రమణ
  • రాష్ట్రంలో జరిగే కాంట్రాక్టులూ ఇక్కడికే.. ఆర్డినెన్స్‌ జారీ చేస్తాం
  • జస్టిస్‌ రమణ దీవెన ఫలితమే రాజధానికి ఐఏఎంసీ: కేసీఆర్‌


హైదరాబాద్‌కు అనుకూలంగా నేను ఏ నిర్ణయాలు తీసుకోలేదు. దానికున్న అర్హతల కారణంగానే అన్ని కేంద్రాలు ఇక్కడికి వస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతానికి హైదరాబాద్‌ వారధిలా ఉంది. వివిధ భాషలు, సంస్కృతులు, మతాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. అన్నింటికన్నా మిన్నగా ఇక్కడి ప్రజలు సాదరంగా ఆహ్వానించే సాటి లేని గొప్ప మనస్తత్వం కలిగిన వారు.

- సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ


హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌ ఐఏఎంసీ ఏర్పాటుతో ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ విషయంలో మన దేశం అంతర్జాతీయ కేంద్రంగా మారుతుంది. ఢిల్లీ, ముంబైల్లో ఆర్బిట్రేషన్‌ సెంటర్లు ఉన్నా.. జాతీయ, అంతర్జాతీయ పార్టీలు ఇంకా విదేశాల్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రాలైన లండన్‌, సింగపూర్‌కే వెళుతున్నాయి. హైదరాబాద్‌ సెంటర్‌లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విదేశాల్లోని ఆర్బిట్రేషన్‌ సెంటర్లకు వెళ్లడం తగ్గుతుంది. జాతీయ, అంతర్జాతీయ వినియోగదారులు హైదరాబాద్‌కు వస్తారు. ఈ సెంటర్‌కు వచ్చే కేసులు పెరుగుతాయి’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అన్ని రకాల కుటుంబ, వాణిజ్య వివాదాల పరిష్కారానికి ఐఏఎంసీ హైదరాబాద్‌ గొప్ప కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. దేశంలోని గొప్ప నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని, ఇటువంటి నగరంలో ఏర్పాటు చేయడం కూడా ఐఏఎంసీకి మరో ఆకర్షణ అని చెప్పారు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ)ను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. 


ఐఏఎంసీ ప్రారంభోత్సవంలో భాగంగా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను సీజేఐ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. తన సొంత నగరం కాబట్టి హైదరాబాద్‌ను ఎంపిక చేశానని అనుకుంటారేమోనని, గ్లోబల్‌ సిటీ అయిన హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉండడం వల్లే ఐఏఎంసీ ఇక్కడికి వచ్చిందని తెలిపారు. ‘‘హైదరాబాద్‌ నా సొంత నగరం. దీనిని ఎంపిక చేయడం పట్ల కొంత వివక్ష చూపానని నన్ను నిందిస్తారేమో! కానీ, నిజాయితీగా చెప్పాలంటే దేశంలోని గొప్ప నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. వాణిజ్య, వ్యాపారాలకు గొప్ప డెస్టినేషన్‌గా ఉంది. ఇలాంటి గొప్ప నగరమైన హైదరాబాద్‌ కీర్తిని పెంపొందించే విధంగా నా వంతు కృషి చేయడం నాకు గర్వకారణంగా ఉంది. హైదరాబాద్‌కు అనుకూలంగా నేను ఏ నిర్ణయాలు తీసుకోలేదు. దానికున్న అర్హతల కారణంగానే అన్ని కేంద్రాలు ఇక్కడికి వస్తున్నాయి. అన్నింటికన్నా మిన్నగా ఇక్కడి ప్రజలు సాదరంగా ఆహ్వానించే సాటి లేని గొప్ప మనస్తత్వం కలిగిన వారు’’ అని వివరించారు.


నాలుగు నెలల్లోనే..

సీఎం కేసీఆర్‌తో చెప్పిన తర్వాత కేవలం నాలుగు నెలల్లోనే ఐఏఎంసీ హైదరాబాద్‌ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ‘‘ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ సైతం పాల్గొనడం సంతోషకరం. నేను సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టి్‌సగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూన్‌లో హైదరాబాద్‌ వచ్చాను. అప్పుడే ఐఏఎంసీ సెంటర్‌ గురించి చెప్పాను. వెంటనే, సీఎం కేసీఆర్‌ చాలా వేగంగా స్పందించారు. నాలుగు నెలల్లోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రం అందుబాటులోకి వచ్చింది. సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ కంటే గొప్పగా ఉందని చాలామంది చెబుతున్నారు. తక్కువ సమయంలో ఇంత గొప్ప కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకు రావడం రాష్ట్ర ప్రభుత్వ గొప్పదనం’’ అని కొనియాడారు. 15 రోజుల కిందటే ఐఏఎంసీ పరిచయ సదస్సు నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌కు భారత్‌లో చాలా చరిత్ర ఉందన్నారు. 1995లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు ఢిల్లీలో అంతర్జాతీయ ఏడీఆర్‌ సెంటర్‌ను ప్రారంభించారని, తక్కువ ఖర్చుతో ప్రభావశీలమైన వివాద పరిష్కార వ్యవస్థ అందుబాటులో ఉంటేనే ఏ ప్రజాస్వామ్యానికైనా మనుగడ ఉంటుందని అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక (ఏడీఆర్‌) అవసరం ఏర్పడిందని, దానికి అనుగుణంగానే ఆర్బిట్రేషన్‌ అండ్‌ కన్సీలియేషన్‌ యాక్ట్‌ వచ్చిందని వివరించారు. ‘‘ఐఏఎంసీ ఏర్పాటు అందరం కలిసి ఉమ్మడిగా సాధించిన విజయం. ప్రపంచంలో గొప్ప మీడియేషన్‌ సెంటర్లలో ఐఏఎంసీ ఒకటిగా ఉంటుంది. ప్రారంభం నుంచీ దీనికి అండగా ఉన్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఏదైనా సవాల్‌గా తీసుకుంటే సాధించే వరకూ వదలరనే పేరు కేసీఆర్‌కు ఉంది. ఆయన సంకల్పం వల్లే ఈ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించాం’’ అని తెలిపారు.


లలిత్‌ మోదీ కుటుంబ వివాద పరిష్కారానికి..

హైదరాబాద్‌ ఐఏఎంసీ సెంటర్‌ను ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జస్టిస్‌ హిమా కోహ్లి సైతం సభ్యురాలిగా ఉన్న తమ ధర్మాసనం ఎదుటకు లలిత్‌ మోదీ కుటుంబ వివాదం వచ్చిందని, మీడియేషన్‌కు వెళ్లాలని తాము సూచించామని, దానికి వారు అంగీకరించారని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. ఐఏఎంసీ హైదరాబాద్‌ సేవలు సైతం ఉపయోగించుకోవాలని వారికి సూచించామన్నారు. ‘‘ప్రారంభానికి ముందే ఒక కేసు వచ్చింది. ఐఏఎంసీకి రావడానికి చాలా కేసులు సిద్ధంగా ఉన్నాయని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌ రావు చెప్పారు. తెలంగాణ, ఏపీ చీఫ్‌ జస్టి్‌సలు ఇక్కడే ఉన్నారు. ఏమైనా మధ్యవర్తిత్వం కేసులు ఉంటే ఇక్కడికే సిఫారసు చేయాలని కోరుకుంటున్నాం. తక్కువ ఖర్చు, ప్రభావశీలమైన పరిష్కారం ఉండే ఈ సెంటర్‌ ఆసియాతోపాటు ప్రపంచంలోనే గొప్ప ఆర్బిట్రేషన్‌ సెంటర్‌గా ఎదుగుతుంది’’ అని ఆకాంక్షించారు. 


ప్రచారం చేసుకోవట్లేదు అంటున్నారు

అంతర్జాతీయ ప్రమాణాలకు మించి హైదరాబాద్‌ పురోగమిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘ఈ మధ్య విదేశాల్లోని చాలా మంది స్నేహితులు చెప్పారు. మీరు హైదరాబాద్‌లో చాలా చేస్తున్నారు. కానీ, ప్రచారం చేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. సింగపూర్‌ నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా హైదరాబాద్‌ను సందర్శించి.. మీరు ప్రమోట్‌ చేయడం లేదని చెప్పారు’’ అని వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో జరిగే కాంట్రాక్టులు ఇక్కడికే వచ్చేలా చట్టాలు మారుస్తాం: కేసీఆర్‌

రాష్ట్రంలో జరిగే కాంట్రాక్టులు ఐఏఎంసీకే వచ్చేలా చట్టాలను సవరిస్తామని, అందుకనుగుణంగా ఆర్డినెన్స్‌ను జారీ చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘‘ఐఏఎంసీ పరిచయ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ గారు తెలుగులో మాట్లాడారు. ఆయనను చూసి నేను తెలుగులో మాట్లాడుతున్నాను. మనందరం గర్వించే స్థాయిలో భారత న్యాయ వ్యవస్థ శిఖరంగా ఉన్న సీజేఐ ఎన్వీ రమణ ఐఏఎంసీ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు. మీరందరూ చప్పట్లతో ఆయన కృషిని అభినందించాలి. జస్టిస్‌ రమణ హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ చేసి ఇక్కడే ఎదిగారు. తాను ఎదిగిన ప్రాంతానికే ఐఏఎంసీని తీసుకు రావాలని ఆయన కృషి చేశారు. వారి దీవెన ఫలితమే ఐఏఎంసీ’’ అని వివరించారు. త్వరితగతిన ఐఏఎంసీకి కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, సీఎస్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సెంటర్‌ అభివృద్ధికి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ రవీంద్రన్‌, జస్టిస్‌ లావు నాగేశ్వర్‌ రావు చాలా ఆసక్తి చూపారని గుర్తు చేశారు. 


‘‘భవిష్యత్తులో అనేక రంగాల్లో హైదరాబాద్‌ ప్రపంచస్థాయి డెస్టినేషన్‌ కాబోతోంది. అనేక కారణాల వల్ల కోర్టుల్లో కేసుల పరిష్కారం ఆలస్యమవుతోంది. ఆర్బిట్రేషన్‌ అనేది అంతర్జాతీయంగా ఫ్యాషన్‌గా మారింది. అలాంటి సెంటర్‌ హైదరాబాద్‌లో రావడం.. అందుకు జస్టిస్‌ రమణ దీవెనలు ఉండడం గర్వకారణం. దీనికి గొప్ప భవిష్యత్తు ఉంది’’ అని చెప్పారు. సెంటర్‌ ప్రారంభానికి ముందే చాలా పెద్ద కేసు రావడం సంతోషకరమైన విషయమని, సీజేఐగా ఎన్వీ రమణ ఉన్న కాలంలోనే చాలా కేసులు ఈ సెంటర్‌ వస్తాయని, తద్వారా ఈ సెంటర్‌కు గొప్ప పేరు వస్తుందని ఆకాంక్షించారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వంతో జరిగే కాంట్రాక్టులు, ప్రైవేటు కాంట్రాక్టులు, పెద్ద పెద్ద పరిశ్రమలతో జరిగే ఒప్పందాలు ఈ సెంటర్‌కే వచ్చేలా రాష్ట్ర చట్టాలను సవరించాల్సి ఉంది. ఈ విషయంలో మా సీఎ్‌సకు గైడెన్స్‌ ఇవ్వాలని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌ రావుకు విజ్ఞప్తి చేశాం. చట్టాల్లో మార్పుల కోసం వెంటనే ఆర్డినెన్స్‌ తెస్తాం’’ అని వివరించారు. చేతులు జోడించి సీజేఐ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎంసీ ట్రస్టీ జస్టిస్‌ రవీంద్రన్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ హిమా కోహ్లి, తెలంగాణ సీజే జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T07:16:59+05:30 IST