హుజురాబాద్ ఫలితాలు అలా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా?

ABN , First Publish Date - 2021-11-02T16:12:38+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇటు అధికార పార్టీకి..

హుజురాబాద్ ఫలితాలు అలా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా?

హుజురాబాద్ ఉప ఎన్నికలు ఇటు అధికార పార్టీకి, అటు ప్రతి పక్షాలకు సవాలుగా మారిన విషయం విదితమే. హుజురాబాద్‌లో తమ జెండాను ఎగురవేయాలని ఆయా పార్టీల నాయకులు పట్టుదలతో  పనిచేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి కొండంత బలం వచ్చినట్లుయ్యింది. ఒకవేళ ఈటెల బీజేపీలో చేరని పక్షంలో హుజురాబాద్‌లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఏర్పడేది. కాగా కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. నిజానికి పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా పేరొందారు.


గత ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు గట్టి పోటి ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కనీసం రెండో స్థాయిలో కూడా నిలిచేందుకు అవకాశాలు కనిపించడం లేదు. ఈటల వర్సెస్ టీఆర్ఎస్‌గా హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగాయనేది అందరికీ తెలిసిందే. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో హుజురాబాద్‌లో కమలం వికసించకూడదనే పట్టుదలతో కాంగ్రెస్ అధినాయకత్వం పనిచేసిందని తెలిసింది. కారు గెలిచినా పర్వాలేదుకానీ.. బీజేపీ ఓడిపోవాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. అయితే బీజేపీ గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం కాంగ్రెస్‌పై భారీగా ఉండనుంది. ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపి తన సత్తా చాటనుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ గౌరవనీయ ఓట్లు మాత్రమే సాధిస్తుందే తప్ప గెలిచే పరిస్థితులే లేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును టీఆర్ఎస్‌కు మళ్లించేందుకే పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి పంపించారనే ప్రచారం జరిగింది. Updated Date - 2021-11-02T16:12:38+05:30 IST