గత ఎన్నికల్లో Huzurabad లో పార్టీలకు వచ్చిన ఓట్ల లెక్కలివీ.. ఎంత మెజార్టీతో ఈటెల గెలిచారంటే..

ABN , First Publish Date - 2021-11-02T15:32:18+05:30 IST

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు యుద్దాన్ని తలపించేలా జరిగాయి.

గత ఎన్నికల్లో Huzurabad లో పార్టీలకు వచ్చిన ఓట్ల లెక్కలివీ.. ఎంత మెజార్టీతో ఈటెల గెలిచారంటే..

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు యుద్దాన్ని తలపించేలా జరిగాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోరు జరిగింది. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. హుజురాబాద్‌లో ముక్కోణ పోరు నెలకొన్నప్పటికీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మధ్యనే టఫ్‌ఫైట్‌ ఉంటుందనే అంచనాలున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చూపిన స్థాయిలో ప్రభావం చూపుతారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లను దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్‌ భార్య జమున ఎంతో శ్రమించారు. అలాగే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ భార్య శ్వేత కూడా ప్రచారంలో దూసుకుపోయారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ తల్లి బల్మూరి పద్మ కూడా ప్రచారం చేశారు. 


హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన నేత ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి 2018 ఎన్నికలలో పోటీ చేసి. కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటెల పదవీ స్వీకారం చేశారు. అయితే అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై 2021లో ఈటెల తన పదవికి రాజీనామా చేశారు. అలాగే తన శాసన సభ పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, భారతీయ జనతాపార్టీలో చేరారు. ఫలితంగా హుజురాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వచ్చాయి. హుజురాబాద్‌ నియోజగవర్గంలో గతంలో జరిగిన 6 దఫాల ఎన్నికలలోనూ వరుసగా టీఆర్ఎస్ విజయం సాధిస్తూ వచ్చింది. అందులో ఈటెల గత 4 దఫాల ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేయగా కేవలం 1683 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో నోటాకి 2867 ఓట్లు వచ్చాయి. అంటే గతంలో బీజేపీ ఓట్లు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.


ఇక అంతకుముందు జరిగిన ఎన్నికల విషయానికొస్తే.. 2004లో జరిగిన హుజూరాబాద్ శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి చెందిన కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెద్దిరెడ్డి పై 44,669 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో లక్ష్మీకాంతరావుకు 81,121 ఓట్లు దక్కగా, పెద్దిరెడ్డికి 36,451 ఓట్లు వచ్చాయి. అలాగే అప్పటి కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నుంచి పోటీ చేసిన ఇనుగాల భీమారావు 5,281 ఓట్లు దక్కించుకున్నారు. ఇక 2009 శాసనసభ ఎన్నికలలో ఈ హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున కృష్ణమోహన్, బీజేపీ నుంచి కె.రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్, ప్రజారాజ్యం తరఫున పి.వెంకటేశ్వర్లు, సమతా పార్టీ నుంచి ఇ.భీమారావు, లోక్‌సత్తా పార్టీ నుండి కె.శ్యాంసుందర్ తదితరులు పోటీచేశారు.

Updated Date - 2021-11-02T15:32:18+05:30 IST