హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం
ABN , First Publish Date - 2021-10-21T08:38:31+05:30 IST
ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని..

అదనపు బలగాలు, పరిశీలకులను పంపించండి
ఎలకా్ట్రనిక్ చెల్లింపులను నిలిపేయండి
కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతల వినతి
న్యూఢిల్లీ/బర్కత్‌పుర, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అదనపు కేంద్ర బలగాలతో పాటు అదనపు పరిశీలకులను పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రభావితం చేయడానికి ఓటర్లకు గూగుల్ పే వంటి ఎలకా్ట్రనిక్ చెల్లింపుల ద్వారా డబ్బులను బదిలీ చేస్తున్నారని, పోలింగ్ పూర్తయ్యే వరకు ఎలకా్ట్రనిక్ చెల్లింపులను నిలిపివేయాలని అభ్యర్థించారు. బుఽధవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర, కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్రపాండేను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, నేతలు రాంచందర్‌రావు, బంగారు శృతి, ఆంటోని రెడ్డి తదితరులు కలిసి వినతిపత్రం అందించారు. స్థానిక పోలీసులు, ముఖ్యంగా హుజూరాబాద్ సీఐ.. బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, తమ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించగా.. ఇందుకు బీజేపీనే కారణమంటూ టీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ విజ్ఞప్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్లు హామీ ఇచ్చారని లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు.