కేసీఆర్‌లో చలనం రావడానికి ఇంకెందరు రైతులు చావాలి?

ABN , First Publish Date - 2021-11-27T08:15:27+05:30 IST

సీఎం కేసీఆర్‌లో చలనం రావాలంటే ఇంకెందరు రైతులు బలి కావాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్‌లో చలనం రావడానికి ఇంకెందరు రైతులు చావాలి?

  • టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్వీట్‌
  • యాసంగి పంటల సేకరణకు 5 వేల కోట్లివ్వండి: జీవన్‌రెడ్డి
  • సచివాలయంలో కూల్చిన మసీదులను..
  • యథాస్థానంలో నిర్మిస్తున్నారా?: షబ్బీర్‌ అలీ
  • నేడు, రేపు ధర్నాచౌక్‌లో కాంగ్రెస్‌ వరి దీక్ష 
  • రేవంత్‌, భట్టి సహా పాల్గొననున్న ముఖ్యనేతలు


హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌లో చలనం రావాలంటే ఇంకెందరు రైతులు బలి కావాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో రైతు రాజయ్య గుండె ఆగి వరికుప్పపైనే ప్రాణాలు వదిలాడన్నారు. అయినా బండరాయి లాంటి కేసీఆర్‌ గుండెకు చలనం లేదా అని శుక్రవారం రేవంత్‌ ట్వీట్‌ చేశారు. కాగా, వరి, మొక్కజొన్న సహా యాసంగి పంటల సేకరణకు సీఎం కేసీఆర్‌ రూ.5 వేల కోట్లు కేటాయిస్తే ఏ సమస్యా రాకుండా తాను చూసుకుంటానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మెడలు వంచుతానంటూ ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌.. తానే మెడలు వంచుకుని వచ్చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని, ఆ పార్టీకి 8 అసెంబ్లీ సీట్లు వస్తే గొప్పేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంతరావు అన్నారు. కొత్త సచివాలయం ప్రాంగణంలో గతంలో కూల్చిన రెండు మసీదులు యథాస్థానంలో నిర్మించడంలేదన్న అనుమానాన్ని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ వ్యక్తం చేశారు. మసీదుల ప్రారంభోత్సవానికి వెళ్లిన వారిలో కొందరు ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కాగా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో వికలాంగుల సంక్షేమ శాఖ విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్‌ ముత్తినేని వీరయ్య డిమాండ్‌ చేశారు.   


రేవంత్‌తో కలిసి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీక్ష

రైతుల చివరి ధాన్యం గింజ వరకూ ప్రభుత్వం కొనాల్సిందేనన్న డిమాండ్‌తో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శనివారం కాంగ్రెస్‌  ఆధ్వర్యలో వరి దీక్షను నిర్వహించనున్నారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పార్టీ ఇతర ముఖ్యనేతలూ పాల్గొంటున్నారు. దీక్షకు వేలాదిగా రైతులు, కార్యకర్తలు తరలి రావాలంటూ కిసాన్‌ కాంగ్రెస్‌  పిలుపునిచ్చింది. కాగా, ఈ దీక్షలో రేవంత్‌రెడ్డితో కలిసి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ నియామకం పట్ల అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి.. సందర్భం దొరికినప్పుడలా దానిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారి రేవంత్‌తో కలిసి ఆయన వేదికను పంచుకోనున్నారు. అయితే రైతన్న కన్నీళ్లను తుడవడానికి కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న దీక్షకు ఒక ఉద్యమ నేతగా, రైతు బిడ్డగా తాను హాజరవుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో కోమటిరెడ్డి తెలిపారు. కాగా, చివరి ధాన్యం గింజ వరకూ కొనేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి హెచ్చరించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు.  పంటను కొనలేని చవట ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్‌ ధ్వజమెత్తారు.  

Updated Date - 2021-11-27T08:15:27+05:30 IST