పిల్లలే తల్లిలా చూసుకున్నారు..

ABN , First Publish Date - 2021-05-20T17:43:09+05:30 IST

చాదర్‌ఘాట్‌ ఆజంపురాకు చెందిన వంగాల మంజుల (45) భూమి రిజిస్ట్రేషన్‌ కోసం గత నెల 12న యాదాద్రి వెళ్లారు...

పిల్లలే తల్లిలా చూసుకున్నారు..

మనోధైర్యమే కరోనాకు అసలు మందు

ఆధ్యాత్మికం, యోగా ద్వారా కోలుకున్నా

గృహిణి వంగాల మంజుల 


హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: చాదర్‌ఘాట్‌ ఆజంపురాకు చెందిన వంగాల మంజుల (45) భూమి రిజిస్ట్రేషన్‌ కోసం గత నెల 12న యాదాద్రి వెళ్లారు. ఇంటికి వచ్చిన ఆమెకు తీవ్రమైన ఒంటి నొప్పులతో జ్వరం వచ్చింది. నోరు చేదుగా మారింది. మరుసటి రోజు ఉగాది పండుగ. ఉగాది పచ్చడి కూడా తినబుద్దికాలేదు. అనుమానం వచ్చి ఆజంపురా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదే నెల 15న కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు మందుల కిట్‌ను ఇచ్చారు. క్రమం తప్పకుండా ఐదురోజులు వాడడంతో జ్వరంతో పాటు ఒంటి నొప్పులు తగ్గాయి. అయినప్పటికీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఆమె కరోనాను ఎలా జయించారో ఆమె మాటల్లోనే...


మొదట్లో భయం.. 

కరోనా సోకినట్లుగా నిర్ధారణ కాగానే విపరీతమైన భయం కలిగింది. భర్త, ఇద్దరు పిల్లలు, అత్తా, మామకు దూరంగా ఉండాలా, పలకరించే వారుండరా, ఒంటరిగా 14 రోజులు గడపాలా అనే భయాలు మనస్సులో మెదిలాయి. మెల్లగా మనోధైర్యాన్ని కూడగట్టుకున్నా. ఎలాగైనా కరోనాను జయించి వృద్ధాప్యంలో ఉన్న అత్తా, మామలు, ఇంజనీరింగ్‌ చదువుతున్న పిల్లలు, భర్తకు మళ్లీ చేరువ కావాలని సంకల్పించుకున్నా. 


బ్రహ్మంగారి జీవిత చరిత్ర చదివా

క్వారంటైన్‌లో ఒంటరిగా ఉన్నాననే భావన కలగకుండా ఆధ్యాత్మికతపై దృష్టి సారించాను. మొదటి రోజున ఒంటరిగా ఉన్నాననే భావన కలిగినా, సరైన ఆహారం తీసుకుంటూ, మందులు వేసుకుంటూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నా. ఖాళీ సమయంలో బ్రహ్మంగారి జీవిత చరిత్ర పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టాను. దీంతో ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్‌ కలగలేదు. భగవంతుడి ధ్యానంలో 14 రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. 


పిల్లలే భోజనం అందించేవారు

పిల్లలు ఉదయాన్నే కషాయం, ఉడికించిన కోడి గుడ్డు, డ్రై ఫ్రూట్స్‌ అందించేవారు. ఏది అడిగితే ఆ టిఫిన్‌ తయారు చేసేవారు. మధ్యాహ్నం భోజనంలో సలాడ్స్‌, రెండు రకాల కూరగాయలతో పౌష్టికాహారం అందించేవారు. సాయంత్రం 4 గంటలకు గ్రీన్‌ టీ ఇచ్చేవారు. 6 గంటలకు పులియబెట్టిన మజ్జిగలో సిరిధాన్యాలు కలిపి ఇచ్చేవారు. రాత్రి 9 గంటలకు రెండు రకాల కూరలతో రెండు చపాతీలు తినేదాన్ని. ఆ 14 రోజులూ ఇంట్లో ఉన్న నానమ్మ, తాతయ్య, నాన్నలకు పిల్లలే భోజనం వండి వడ్డించేవారు. క్వారంటైన్‌ సమయంలో పిల్లల సేవలు మరువలేనివి. 


పాటించిన చిట్కాలు

ఏప్రిల్‌ 30న మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. కరోనాను జయించినప్పటికీ చిట్కాలను మానలేదు. ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టి, బ్రీతింగ్‌ వ్యాయామం చేసి ఆరోగ్య పరంగా పురోగతి సాధించాను. నిజ జీవితంలో బ్రీతింగ్‌ వ్యాయామం (భస్త్రికా ప్రాణాయమం) చాలా అవసరమని, ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ లెవల్‌ పెంచుకోడానికి ఈ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. పౌష్టికాహారంతో పాటు సి విటమిన్‌ ఉండే ఆరెంజ్‌, బొప్పాయి తప్పనిసరిగా తీసుకున్న. ఇమ్యూనిటీ మరింత పెంచుకోడానికి ఖాదర్‌ వలీ చిట్కాల్లోని జామ ఆకు రసంతో పాటు, వేడి నీటిలో పసుపు, వాము, కొత్తిమీర కలిపి తాగితే మంచి ఉపశమనం పొందొచ్చు. కరోనా బారిన పడిన వారు ప్రధానంగా మనోధైర్యం కోల్పోవద్దు.

Updated Date - 2021-05-20T17:43:09+05:30 IST