200 పడకలతో పటాన్‌చెరులో.. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

ABN , First Publish Date - 2021-02-08T09:43:51+05:30 IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఆస్పత్రి సూపర్‌స్పెషాలిటీగా అభివృద్ధి చెందనుంది. ప్రస్తుతం 100 పడకలతో ఏరియా ఆస్పత్రిగా సేవలందిస్తున్న ఈ దవాఖానా స్థాయిని 200

200 పడకలతో పటాన్‌చెరులో..  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

 ఉస్మానియా, గాంధీలపై ఒత్తిడి తగ్గించేందుకే

 ఎన్జీటీ ఆదేశాలతో  సిద్ధమైన 105 కోట్ల నిధులు


సంగారెడ్డి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఆస్పత్రి సూపర్‌స్పెషాలిటీగా అభివృద్ధి చెందనుంది. ప్రస్తుతం 100 పడకలతో ఏరియా ఆస్పత్రిగా సేవలందిస్తున్న ఈ దవాఖానా స్థాయిని 200 పడకలకు పెంచాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రోగుల తాకిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు.. 2017లో జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) చేసిన సూచనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనుంది. జిల్లాతోపాటు.. పటాన్‌చెరు పరిసరాల్లోని పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు.. క్షతగాత్రులను గాంధీకి తరలిస్తున్నారు. పటాన్‌చెరు ఆస్పత్రిని సూపర్‌స్పెషాలిటీగా మారిస్తే.. ఆ సేవలు ఇక్కడే అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడున్న ఏరియా ఆస్పత్రి పక్కనే.. మరో భవనాన్ని నిర్మించి, ఆస్పత్రి సేవలను విస్తరించనున్నారు.


30 ఏళ్ల తర్వాత.. ఎన్జీటీ ఆదేశాలతో..

పారిశ్రామిక ప్రదేశం కావడంతో.. పటాన్‌చెరులో పీల్చేగాలి, తాగేనీరు కలుషితమవుతున్నాయి. ఫలితంగా మహిళలకు గర్భస్రావాలు తీవ్రంగా జరిగేవి. దీంతో కొందరు పర్యావరణవేత్తలు 1990-91 కాలంలో సుప్రీంకోర్టులో కేసు వేశారు. అక్కడి నుంచి కేసు హైకోర్టుకు బదిలీ అయ్యింది. అదే సమయంలో కొందరు వ్యక్తులు ఇదే అంశంపై ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో.. హైకోర్టు కూడా తన పరిధిలో ఉన్న కేసును ఎన్జీటీకి బదిలీ చేసింది. దీనిపై 2017లో విచారణ పూర్తయింది. అప్పట్లో ఎన్జీటీ కీలకమైన సూచనలు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. పటాన్‌చెరు పరిసరాల్లో, పారిశ్రామిక వాడల్లో నివసించేవారికి అన్నిరకాల వైద్య సేవలను ఉచితంగా అందజేయాలని పేర్కొంది. అందుకోసం ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని సూచించింది. దీనికి కావాల్సిన నిధులను పరిశ్రమలే అందజేయాలని ఆదేశించింది. దాంతో ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు సమయంలో.. ప్రాజెక్టు వ్యయంలో 1ు, అనంతరం పరిశ్రమల టర్నోవర్‌పై ఏటా 0.5ు మొత్తాన్ని వసూలు చేసి బొల్లారం పర్యావరణ నిధి పేరుతో కార్ప్‌సఫండ్‌లో జమచేసింది. ఇప్పుడు ఈ ఖాతాలో రూ. 105 కోట్లు ఉన్నాయి. 


ఛాతీ ఆస్పత్రిలో నిర్మించాలనుకున్నా..

బొల్లారం పర్యావరణ నిధులతో తొలుత ఎర్రగడ్డలోని చెస్ట్‌హాస్పిటల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించారు. కానీ, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి పక్కనే సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల మంత్రి హరీశ్‌రావు డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-02-08T09:43:51+05:30 IST