డిమాండ్లెన్నో..ఇచ్చేది కొన్నే!

ABN , First Publish Date - 2021-02-01T07:40:27+05:30 IST

తెలంగాణకు వచ్చే ఆదాయంలో సొంత రాబడే 75 శాతం వరకు ఉంది. కేవలం 25 శాతం ఆదాయం కేంద్రం నుంచి వస్తోంది. ఈ 25 శాతంలోనూ కొన్నిసార్లు పరిస్థితి అటూఇటుగా మారుతోంది. ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో

డిమాండ్లెన్నో..ఇచ్చేది కొన్నే!

ఇచ్చే పావలాలోనూ ఆటుపోట్లు

సిఫారసులనూ అమలు చేయరు

కేంద్రం తీరుపై రాష్ట్రం అసంతృప్తి

32 జిల్లాలకూ వెనుకబాటు నిధులు

నేటి కేంద్ర బడ్జెట్‌పై ఆశలు!

బయ్యారానికి నిధులివ్వాలి: హరీశ్‌

కాళేశ్వరానికి జాతీయ హోదా: వినోద్‌


తెలంగాణకు కేంద్రం నిధులివ్వడం 

లేదన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణ. ఇచ్చిన, కేటాయించిన నిధులను రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదన్నది కేంద్ర ప్రభుత్వ పెద్దల విమర్శ. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం ఏమిటి? ఇందులో ఎవరి వాటా ఎంత? అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణకు వస్తున్న ఆదాయంలో పావలా వంతు మాత్రమే కేంద్రం నుంచి వస్తోందని, అందులోనూ కేటాయింపుల్లో కోత పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కేంద్రం తీరుపై అసంతృప్తితో ఉన్న రాష్ట్ర పెద్దలు ఈసారి బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం జరుగుతుందో లేదోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు వచ్చే ఆదాయంలో సొంత రాబడే 75 శాతం వరకు ఉంది. కేవలం 25 శాతం ఆదాయం కేంద్రం నుంచి వస్తోంది. ఈ 25 శాతంలోనూ కొన్నిసార్లు పరిస్థితి అటూఇటుగా మారుతోంది. ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా నిరుడు రూ.14,348 కోట్లు రావాల్సి ఉండగా, రూ.11,450 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది రూ.10,906 కోట్లు వస్తాయని అంచనా వేస్తే.. డిసెంబరు నాటికి రూ.5,341 కోట్లు మాత్రమే వచ్చాయి. వచ్చే ఏడాది (2021-22) అయినా ఆశించిన మేర నిధులు వస్తాయా? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలించిన తర్వాత దీనిపై అంచనా వేయడానికి వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిఽధుల కింద రాష్ట్రంలోని పాత తొమ్మిది జిల్లాలకు ఏటా రూ.450 కోట్లు వస్తున్నాయి. అయితే దీన్ని 32 జిల్లాలకు అమలు చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాదితో పాటు, వచ్చే ఏడాది నిధులను కూడా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిని సీఎం కేసీఆర్‌ కోరారు. రెండేళ్లకు సంబంధించి మొత్తం రూ.900 కోట్లు విడుదల కావాల్సి ఉంది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మాత్రం కొంత ఎక్కువగా వ స్తోంది. ఈ ఏడాది మొత్తం రూ.10,535 కోట్లు వస్తుందని అంచనా వేయగా, డిసెంబరు నాటికి రూ.12,018 కోట్లు వచ్చింది. అలాగే సెస్‌ ద్వారా వివిధ రంగాల నుంచి వసూలు చేస్తున్న నిధుల్లో రాష్ట్రాల వాటాను ఇవ్వడం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లారు.  


వాటిలో ముఖ్యమైనవి.. 

  • రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.85 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్రం ఎప్పటి నుంచో కోరుతోంది. జాతీయ హోదా ఇస్తే నిర్మాణ వ్యయంలో సుమారు 90ు (భూసేకరణ మినహాయించి) నిధులు వస్తాయి. అలా కాకుండా ఈ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని రాష్ట్రం డిమాండ్‌ చేస్తోంది. 
  • మిషన్‌ భగీరథకు రాష్ట్రం రూ.42 వేల కోట్లు వ్యయం చేసింది. ఈ పథకానికి రూ.19 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. ఇప్పటి వరకు పైసా కూడా రాలేదు.  
  • వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కేంద్రం ఇస్తున్న పింఛను రూ.200 నుంచి 1000కి పెంచాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వర్గాలకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల వరకు వ్యయం చేస్తోంది. ఇందులో కేంద్రం నుంచి కేవలం రూ.230 కోట్లు మాత్రమే వస్తున్నాయి. కనీసం రూ.5 వేల కోట్ల వరకు కేంద్ర సాయం కావాలని రాష్ట్రం అడుగుతోంది. 
  • కొత్త జిల్లాలకు జవహర్‌ నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని కోరుతోంది. 
  • హైదరాబాద్‌లో వరదలతో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయం కింద రూ.1350 కోట్లను అందించాలని కోరారు. కేంద్రం రూ.254 కోట్లు మాత్రమే ఇచ్చింది. 
  • ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచారు. అయితే వివిధ షరతులతో దీన్ని ముడిపెట్టారు. వచ్చే ఏడాదికి షరతులు లేకుండా అనుమతించాలని కోరుతోంది. 
  • మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ రాయితీ పథకాన్ని అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ వడ్డీ భారం ఏటా సుమారు రూ.500 కోట్ల వరకు పడుతోంది. ఇందులో కనీసం రూ.400 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తోంది. 
  • రాష్ట్రంలో టెక్స్‌టైల్‌, హ్యాండ్లూమ్‌ పార్కులతో పాటు ఫార్మా సిటీ, నిమ్జ్‌ వంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.30 వేల కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. ఆర్థిక సాయం చేయాలంటూ తాజాగా మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.  
  • రైల్వేకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పలు డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీతోపాటు కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నాగులపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్‌, షాద్‌నగర్‌ వరకు ఎంఎంటీఎస్‌ పొడిగింపు, యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుకు ప్రాధాన్యమివ్వడం, హైదరాబాద్‌లో ఏసీ ఎంఎంటీఎస్‌ బోగీలను ఏర్పాటు చేయడం, సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, వారాణసీ, గువాహటిలకు అదనపు రైళ్లను వేయడం వంటి వాటిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వీటిపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన వస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.


కాళేశ్వరానికి నిధులు ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలి. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వాలి. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేశాం. అలాగే మిషన్‌ భగీరథకు నిధులు కేటాయించాలి. ఇప్పటికే నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినందున ఆ మేరకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.

- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌


ఉక్కు ఫ్యాక్టరీకి నిధులివ్వాలి 

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. దీనికి సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ పేర్కొన్నారు. అయినా ఆరేళ్లుగా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే వివిధ రకాల సెస్‌ రూపంలో కేంద్రం 15 శాతం వసూలు చేస్తోంది. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌, ఆరోగ్యం, విద్య, కొవిడ్‌ సెస్‌ అంటూ వసూలు చేస్తోంది. ఈ నిధుల నుంచి తిరిగి రాష్ట్రాలకు ఏమీ పంపిణీ చేయడం లేదు. ఇప్పటి వరకు వసూలు చేసిన సెస్‌ను పంపిణీ చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ సెస్‌ను ట్యాక్సుల్లో కలపాలి. అలాగే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 5 శాతానికి పెంపు నిర్ణయాన్ని వచ్చే ఏడాది కూడా అమలు చేయాలి. ఎలాంటి షరతులు పెట్టకూడదు.                             

  - రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

Updated Date - 2021-02-01T07:40:27+05:30 IST