ఆశాజనకంగా కందుల ధరలు

ABN , First Publish Date - 2021-02-08T09:46:15+05:30 IST

మార్కెట్‌లో ఈ ఏడాది కందుల ధరలు ఆశాజనకంగా ఉండటంతో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కష్టమేనని చెప్పవచ్చు. వికారాబాద్‌ జిల్లా

ఆశాజనకంగా కందుల ధరలు

క్వింటాలు ధర రూ.6500-7200 వరకు.. 

మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగడం కష్టమే 


తాండూరు, ఫిబ్రవరి 7: మార్కెట్‌లో ఈ ఏడాది కందుల ధరలు ఆశాజనకంగా ఉండటంతో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కష్టమేనని చెప్పవచ్చు. వికారాబాద్‌ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో ఇప్పటివరకు 70వేల క్వింటాళ్ల కందుల క్రయ-విక్రయాలు జరిగాయి. వీటి విలువ దాదాపు రూ.50 కోట్లు. క్వింటాలు ధర రూ.6500 వరకు పలుకుతోంది. శుక్రవారం ఒక్కరోజే క్వింటాలు ధర రూ.7200 పలికింది. మార్కెట్‌కు క్రయ-విక్రయాల కోసం మరో 40 వేల క్వింటాళ్లు రావొచ్చని అంచనా. గతేడాది కందులకు ఆశించిన ధర లభించలేదు. క్వింటాలు రూ.5400-5700 మించలేదు. అయితే ఈ సారి కందుల కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్‌ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలను ఎంపిక చేసింది. మార్క్‌ఫెడ్‌ మాత్రం క్వింటాలు రూ.6 వేల మేరకే కొనుగోలు చేస్తోంది.


జిల్లాలో 8 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినా.. వాటి ప్రారంభానికి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కేంద్రాలు ఏర్పాటు చేసినా.. రైతులు అక్కడ విక్రయించే పరిస్థితి లేదు. ప్రస్తుతం మార్కెట్‌లోనే ఆశాజనకంగా ఉండటంతో రైతులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్‌ సెంట్రల్‌ కోటా కింద 77వేల టన్నులు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయాలని అంచనా వేసింది. పంట చేతికి వచ్చి నెలరోజులు దాటినా.. జనవరిలో ప్రారంభించాల్సిన సెంటర్లను ఇప్పటికీ ప్రారంభించలేకపోతున్నారు. మార్కెట్‌లో కందుల ధరలు ఆశాజనకంగా ఉండటమే ఇందుకు కారణం.  

Updated Date - 2021-02-08T09:46:15+05:30 IST