‘ట్రిపుల్‌ వన్‌’ భూముల్లో కేసీఆర్‌ కుటుంబసభ్యుల ఇళ్లు!

ABN , First Publish Date - 2021-05-02T07:20:20+05:30 IST

జీవో 111 అమల్లో ఉన్న భూముల్లో కేసీఆర్‌ కుటుంబ సభ్యులే ఇళ్లు కట్టారని, దానిపైనా దర్యాప్తు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

‘ట్రిపుల్‌ వన్‌’ భూముల్లో కేసీఆర్‌ కుటుంబసభ్యుల ఇళ్లు!

దానిపైనా దర్యాప్తు చేయాలి: భట్టివిక్రమార్క 


హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): జీవో 111 అమల్లో ఉన్న భూముల్లో కేసీఆర్‌ కుటుంబ సభ్యులే ఇళ్లు కట్టారని, దానిపైనా దర్యాప్తు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఈటల తప్పు చేస్తే చర్యలు తీసుకోవద్దని తాము అనడం లేదని, అయితే కరోనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ వ్యవహారం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. శనివారం జూమ్‌ యాప్‌ ద్వారా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఆక్రమణలకు గురైన భూములను ప్రజలకు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే.. మంత్రి మల్లారెడ్డిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని భట్టి అన్నారు. పువ్వాడ అజయ్‌ తదితర మంత్రులపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అలసత్వం వల్ల రాష్ట్రంలో కరోనా పెరిగిందని, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈటలపై ఆరోపణలను బయటికి తీశారన్నారు. డ్రగ్స్‌ కేసు విచారణకు ఆదేశించి ఆపేశారని, మియాపూర్‌ భూములపై విచారణ చేస్తున్నట్లుగా ఆర్భాటం సృష్టించారని గుర్తు చేశారు. 2014 నుంచి అధికారంలో ఉన్న మంత్రుల భూ కుంభకోణాలపై విచారణ జరిపించే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? అని పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు.  


మల్లారెడ్డి, ముత్తిరెడ్డిపై ఆరోపణల సంగతేంటి?: జీవన్‌రెడ్డి 

‘‘మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను ఎందుకు పట్టించుకోలేదు? కేవలం ఈటలపై వచ్చిన కబ్జా ఆరోపణలే కనిపిస్తున్నాయా? ఓర్వలేనితనంతోనే ఈటలను బలిచేయాలని కేసీఆర్‌ చూస్తున్నారు’’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్‌.. 111 జీవోను ఉల్లంఘించి ఫామ్‌హౌస్‌ నిర్మాణాన్ని చేపడితే విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ భూములు ధరణి వెబ్‌సైట్లో ఎందుకు కనిపించట్లేదని నిలదీశారు. ఈటల ఉద్యమ ఫలితంగానే కేసీఆర్‌ సీఎం అయ్యారన్నారు. మొత్తం కేసీఆర్‌ పరిపాలనపై సీబీఐ విచారణ జరపాలని టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-02T07:20:20+05:30 IST