హోమ్‌ సెలబ్రేషన్సే...

ABN , First Publish Date - 2021-12-31T06:01:42+05:30 IST

హోమ్‌ సెలబ్రేషన్సే...

హోమ్‌ సెలబ్రేషన్సే...

 నూతన సంవత్సర స్వాగత సంబరాలపై పోలీసుల ఆంక్షలు

 బహిరంగ వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు

 ఎవరికి వారు ఇళ్లల్లోనే జరుపుకోవాలని సూచన

 ఒమైక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు


హనుమకొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. ప్రజలు నూతన ఉత్సాహంతో పండుగ చేసుకుంటారు. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ బాణాసంచా కాల్చడం, కేరింతలు, నృత్యాలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడం ఆనవాయితీ. కానీ కరోనా మహమ్మారివల్ల ఆ సంప్రదాయమే మారిపోయింది. పోలీసుల ఆంక్షల వల్ల ఆ జోష్‌ లేకుండా పోయింది. ఈ సారి కూడా కొత్త సంవత్సరం వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావలసిన పరిస్థితి నెలకొంది. ఏ వేడుక లేకుండా మూగపోవలసిన స్థితి వచ్చింది. బహిరంగ ప్రదేశాలు, హోటళ్లలో వేడుకలు నిర్వహించడం లేదు. ఒకవైపు ఒమైక్రాన్‌ వైరస్‌ భయం.. మరో వైపు ప్రభుత్వ ఆంక్షల నడుమ నిరాడంబరంగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు.

ఇది వరకు వరంగల్‌ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగేవి. వివిఽధ సాంస్కృతిక సంస్థలు నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరులు, సాహిత్య గోష్టులు నిర్వహించేవి. ప్రైవేటు సంస్థలు, ఈవెట్‌ ఆర్గనైనేషన్లు పేరున్న హోటళ్లలో కల్చరల్‌ నైట్‌ పేరుతో వేడుకలు ఏర్పాటు చేసేవి. కాలనీలలో సైతం అపార్టుమెంట్‌ వాసులు సెల్లార్లలో వేడుకలను జరిపేవి. బాణాసంచాను పెద్ద ఎత్తున పేల్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా ప్రభావం వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పైగా పోలీసుల విధించిన ఆంక్షలతో నిర్వాహకులు న్యూ ఇయర్‌ వేడుకలను జరపాలనంటేనే భయపడుతున్నారు. నగరంలోని పేరున్న హోటళ్లు కూడా వీటికి దూరంగా ఉంటున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా స్పెషల్‌ ఫుడ్‌ ఫెస్టివల్స్‌ ఏర్పాటు చేసేవి. సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు ఇచ్చేవి. ఫుడ్‌, మధ్యంపై ఆఫర్లు ఇచ్చేవి. ఇప్పుడు అవేవీ లేవు.

కొన్ని సంస్థలు, కమ్యూనిటీలు కొత్త సంవత్సర వేడుకలకు ప్లాన్‌ చేసుకున్నాయి. అదీ అంతర్గతంగానే తప్ప బయటి వారికి ఏ మాత్రం ప్రవేశం లేదు. వరంగల్‌ బిర్లా ఓపెన్‌మైండ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బోమిష్‌ క్యాంప్‌సలో డిసెంబర్‌ 31 రాత్రి 12.40గంటలకు పొట్లక్‌ పార్టీని ఏర్పాటు చేస్తోంది. ఇందులో పాల్గొనేవారు తమ కిష్టమైన ఆహారాన్ని తీసుకువచ్చి అందరితో కలిసి పంచుకోవచ్చు. 

వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1వ తేదీన కల్బరల్‌ నైట్‌ను క్లబ్‌ ఫంక్షన్‌హాల్‌లోనే నిర్వహించనున్నది. ఇక మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లకు మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది.  అయితే వీటిలో సామూహికంగా ఎలాంటి న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకోవడానికి వీలు లేదు.

Updated Date - 2021-12-31T06:01:42+05:30 IST