స్వేచ్ఛగా ఓటేయండి..
ABN , First Publish Date - 2021-10-30T05:06:37+05:30 IST
స్వేచ్ఛగా ఓటేయండి..
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
కమలాపూర్, అక్టోబరు 29: ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం ఉప్పల్, కమలాపూర్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం సాయంత్రం వరంగల్ సీపీ తరుణ్‌జోషితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. మండలంలో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొవిడ్-19 నిబంధనల మేరకు ఓటర్లు భౌతిక దూరం పాటించేలా పోలింగ్ స్టేషన్ల ఎదుట సర్కిల్స్ డ్రా చేశామన్నారు. ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. సీపీ తరుణ్ జోషీ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. మండలంలోని 33 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 500 మంది లోకల్ పోలీసులు, నాలుగు కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విదుల నిర్వహణలో పాల్గొంటున్నారని తెలిపారు.