ఇనుప రాడ్డుతో కొట్టి.. ముగ్గురి హత్య

ABN , First Publish Date - 2021-12-09T07:41:13+05:30 IST

అది నిర్మానుష్య ప్రదేశమేమీ కాదు.. వరికోత యంత్రాలను మరమ్మతు చేసే షెడ్డు. అదేపనిగా

ఇనుప రాడ్డుతో కొట్టి.. ముగ్గురి హత్య

  •  అర్ధరాత్రి హార్వెస్టింగ్‌ రిపేర్‌ షెడ్డులో నిద్రిస్తుండగా ఘోరం
  •  నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి పరిధిలో దారుణం

డిచ్‌పల్లి, డిసెంబరు 8: అది నిర్మానుష్య ప్రదేశమేమీ కాదు.. వరికోత యంత్రాలను మరమ్మతు చేసే షెడ్డు. అదేపనిగా వాహనాలు తిరుగుతుండే జాతీయ రహదారి పక్కనే ఉంది! ఆ షెడ్డు వద్ద అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న ముగ్గురిని గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేశారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని 63వ జాతీయ రహదారి పక్కన గురునానక్‌ గ్యారేజ్‌ వద్ద ఈ ఘోరం జరిగింది. వరికోతల సీజన్‌ కావడంతో యంత్రాల మరమ్మతులకు సంబంధించి పెద్ద మొత్తంలో పోగైన డబ్బును ఎత్తుకెళ్లేందుకే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు.


మృతులను పంజాబ్‌కు చెందిన వరికోత యంత్రాల మెకానిక్‌లు జోగీందర్‌ సింగ్‌ (35), హరిపాల్‌ సింగ్‌ (33)... వీరి స్నేహితుడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ భోజ్యానాయక్‌ తండాకు చెందిన క్రేన్‌ ఆపరేటర్‌ సునీల్‌ కుమార్‌ (25)గా గుర్తించారు. సీపీ కార్తికేయ వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తికి ఆ రహదారి పక్కన వరికోత యంత్రాల మరమ్మతుల షెడ్డు ఉంది. దాన్ని జోగీందర్‌, హరిపాల్‌  నిర్వహిస్తున్నారు. ఆ పక్కనే రాజిరెడ్డి, వరికోత యంత్రాల విడిభాగాలను విక్రయించే షాపు పెట్టారు.


మంగళవారం రాత్రి సునీల్‌ షెడ్డు వద్దకు వచ్చాడు. జోగీందర్‌, హరిపాల్‌ షెడ్డులో, సునీల్‌ ఆరుబటయ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ముగ్గురూ హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌తో ఘటనాస్థలిని పోలీసులు వచ్చి పరిశీలించారు. గ్యారేజ్‌ పక్కన వరికోత యంత్రాల విడిభాగాలను విక్రయించే షాపులో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించారు. ఆ పక్కన ఉన్న హీరో షోరూంలో రికార్డయిన సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ హత్యలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు నిర్ధారించినట్లు చెబుతున్నారు. నడిపల్లి తండా వరకు వెళ్లిన డాగ్‌ స్క్వాడ్‌ అక్కడి నుంచి తిరిగి ఘటనా స్థలికే వచ్చాయి. హత్య కేసును ఛేదించేందుకు డీసీపీ, ఏసీపీ, టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ పోలీసులను ఏర్పాటు చేసినట్లు సీపీ కార్తికేయ తెలిపారు. ముగ్గురి వద్ద ఉన్న మూడు సెల్‌ఫోన్లు, షాపులో ఉన్న రూ.10వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు రాజిరెడ్డి చెప్పాడు. 


Updated Date - 2021-12-09T07:41:13+05:30 IST