దళితబంధుపై ఈసీ నిర్ణయం సబబే!
ABN , First Publish Date - 2021-10-29T08:37:15+05:30 IST
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ ముగిసే వరకు దళితబంధు పథకాన్ని వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్(ఈసీ) ఇచ్చిన ఆదేశాలు సబబేనని హైకోర్టు స్పష్టం చేసింది. హుజూరాబాద్
- ఉప ఎన్నిక షెడ్యూల్ తర్వాతనే జీవో ఇచ్చారు
- దళితబంధు వ్యాజ్యాలను కొట్టేసిన హైకోర్టు
- ఈ పథకం మంచిచెడ్డలపై వ్యాఖ్యానించం: బెంచి
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ ముగిసే వరకు దళితబంధు పథకాన్ని వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్(ఈసీ) ఇచ్చిన ఆదేశాలు సబబేనని హైకోర్టు స్పష్టం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం వాయిదాపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పును వెలువరించింది. ఎన్నికల సంఘం(ఈసీ) సెప్టెంబరు 28న హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూలు ప్రకటించిందని, అక్టోబరు 1న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని దళితబంధు పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తూ జీవో జారీ అయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దళితబంధు పథకాన్ని ఎన్నికల షెడ్యూలు ప్రకటన కంటే చాలా ముందుగా ప్రవేశపెట్టారంటూ పిటిషనర్లు చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు అయినప్పటికీ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా విధివిఽధానాల జారీకి అవకాశం లేదని పేర్కొంది. షెడ్యూలు జారీ అయిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసిన అంశంలో ఎలాంటి వివాదం లేదని పేర్కొంది.
ఈ పరిస్థితుల్లో ఆర్టికల్ 324 కింద దఖలుపడ్డ అధికారాలను ఈసీ ఉపయోగించుకోవడంలో ఎలాంటి దోషం తమకు కనిపించలేదని వ్యాఖ్యానించింది. అయితే దళితబంధు పథకం మంచిచెడ్డల గురించి తాము ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదని పేర్కొన్నది. వాచ్ వాయిస్ సంస్థ దళితబంధు పథకాన్ని వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ వేసిందని, ఈసీ జారీచేసిన వాయిదా నోటిఫికేషన్ ద్వారా పిటిషనర్ సమస్య పరిష్కారం అయిందని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని పిటిషన్లూ కొట్టేస్తున్నట్లు పేర్కొంది.